షేర్ మార్కెట్ నష్టాల దెబ్బ.. రూ. 50 లక్షల కోసం కిడ్నాప్ డ్రామా ఆడిన సూరత్ అకౌంటెంట్!

  • సొంత కిడ్నాప్ కథను సృష్టించిన అకౌంటెంట్ జిగ్నేష్ తలావియా
  • రూ. 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్
  • గోద్రాలోని శివ్ హోటల్లో నిందితుడి గుర్తింపు 
  • పోలీసులను తప్పుదోవ పట్టించడంపై కేసు నమోదు
షేర్ మార్కెట్ వ్యామోహం, ఆప్షన్స్ ట్రేడింగ్‌లో వచ్చిన భారీ నష్టాలు ఒక సాధారణ అకౌంటెంట్‌ను నేరస్తుడిగా మార్చాయి. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన 36 ఏళ్ల జిగ్నేష్ లాల్జీభాయ్ తలావియా అనే అకౌంటెంట్, తన అప్పులను తీర్చుకోవడానికి ఏకంగా తన సొంత కిడ్నాప్ డ్రామాను సృష్టించి కుటుంబ సభ్యుల నుంచి రూ. 50 లక్షలు వసూలు చేయాలని చూశాడు. సూరత్‌లోని మోటా వరాఛా ప్రాంతంలో నివసించే జిగ్నేష్ జూన్ 12న  అకస్మాత్తుగా కనిపించకుండా పోవడంతో, అతడి భార్య మీనాక్షిబెన్ తలావియా ఉత్రాన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే, ఆ తర్వాత కొద్దిసేపటికే ఆమె మొబైల్‌కు కొన్ని గుర్తుతెలియని నంబర్ల నుంచి బెదిరింపు సందేశాలు వచ్చాయి. జిగ్నేష్‌ను తాము కిడ్నాప్ చేశామని, రూ. 50 లక్షల నగదు ఇవ్వకపోతే చంపేస్తామని, పోలీసులకు చెబితే శవాన్ని పంపుతామని ఆ మెసేజ్‌లలో పేర్కొన్నారు. దీనికి తోడు జిగ్నేష్ చేతులు, కాళ్లు కట్టేసి ఉండి, తీవ్రమైన భయాందోళనలతో ఉన్నట్లు నటిస్తున్న కొన్ని వీడియోలు కూడా భార్యకు పంపడంతో ఆ కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది.

ఈ ఉదంతాన్ని అత్యంత తీవ్రమైన కిడ్నాప్ కేసుగా పరిగణించిన సూరత్ డీసీపీ జాలా నేతృత్వంలోని ఉత్రాన్ పోలీసులు, లోకల్ క్రైమ్ బ్రాంచ్ రంగంలోకి దిగాయి. నిందితుల కదలికలను కనిపెట్టేందుకు సాంకేతిక నిఘా, మొబైల్ టవర్ లొకేషన్లు, సీసీటీవీ ఫుటేజీలను నిశితంగా పరిశీలించారు. ఈ క్రమంలోనే ఆ కిడ్నాప్ వీడియోలు, మెసేజ్‌లు గుజరాత్‌లోని పంచ్‌మహల్ జిల్లా గోద్రా పట్టణం నుంచి వస్తున్నట్లు ఐటీ సెల్ గుర్తించింది. జూన్ 15న మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో గోద్రాలోని ‘శివ్ హోటల్’ పై దాడులు నిర్వహించిన పోలీసులు, అక్కడ ఒక గదిలో సురక్షితంగా ఉన్న జిగ్నేష్ తలావియాను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో జిగ్నేష్ ఆడిన డ్రామా మొత్తం బయటపడింది. ఆ కిడ్నాప్ కథనమంతా తానే స్వయంగా అల్లినట్లు చెప్పాడు. హోటల్ గదిలోని గ్రిల్స్‌కు చేతులు ఎలా కట్టుకున్నదీ.. ఫోన్ ద్వారా వీడియోలు ఎలా రికార్డ్ చేసిందీ.. పోలీసుల ముందే రీ-ఎనాక్ట్‌మెంట్ చేసి చూపించడంతో అధికారులు సైతం విస్మయానికి గురయ్యారు.

పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. ఒక ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్‌గా పనిచేస్తూ సాధారణ జీవితం గడుపుతున్న జిగ్నేష్, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో స్టాక్ మార్కెట్ (ముఖ్యంగా కాల్ అండ్ పుట్ ఆప్షన్స్ ట్రేడింగ్)లోకి ప్రవేశించాడు. అయితే మార్కెట్ ఒడిదుడుకుల వల్ల అతడు ఏకంగా రూ. 50 నుంచి 60 లక్షల వరకు నష్టపోయి అప్పుల్లో కూరుకుపోయాడు. ఆ అప్పులు ఇచ్చిన వాళ్ల ఒత్తిడి తట్టుకోలేక, తన సొంత కుటుంబం నుంచే డబ్బులు లాగడానికి ఈ కిడ్నాప్ ప్లాన్ వేసినట్లు నిందితుడు అంగీకరించాడు. పోలీసులను తప్పుదోవ పట్టించడం, ప్రభుత్వ వనరులను, సమయాన్ని వృథా చేయడం, తప్పుడు సాక్ష్యాలను సృష్టించడం వంటి నేరాల కింద జిగ్నేష్‌పై భారతీయ న్యాయ సంహిత లోని సెక్షన్ 212, 217, 233 కింద కేసు నమోదు చేసి, కోర్టు అనుమతితో జైలుకు తరలించారు. 

Jignesh Laljibhai Talavia
Surat accountant fake kidnapping
Stock market loss debt
Options trading crime
Gujarat police arrest
Fake kidnapping drama for money

More Telugu News