ప్రకృతి సేద్యమే రైతుకు రక్ష.. రసాయనాలతో భూమిని విషతుల్యం చేయొద్దు: సీఎం చంద్రబాబు
- ప్రకృతి సేద్యంతోనే రైతులకు, భూమికి ప్రయోజనమన్న సీఎం చంద్రబాబు
- రసాయనాల వాడకంతో పండించిన పంటలకు ప్రపంచ దేశాల తిరస్కరణ
- పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ కింద రైతులకు రూ.3,125 కోట్ల సాయం విడుదల
- త్వరలో ప్రతీ రైతు ఇంటికీ ప్రజాప్రతినిధులు వస్తారని సీఎం ప్రకటన
- కడప, కర్నూలులో వ్యర్థాల నుంచి విద్యుత్ ప్లాంట్లకు శంకుస్థాపన
పురుగుమందుల అవశేషాలు ఉండటమనే కారణంతో ఇటీవల గుంటూరు నుంచి పంపిన మూడు మిర్చి కంటైనర్లను చైనా దేశం తిప్పి పంపిన విషయాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఇలాంటి ఉత్పత్తులను తిరస్కరిస్తున్నాయని, ఇది రాష్ట్ర రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తోందని అన్నారు.
ఉమ్మడి గుంటూరు నుంచి వాణిజ్య పంటలు, రాయలసీమ నుంచి ఉద్యాన ఉత్పత్తులు, ఉభయగోదావరి జిల్లాల నుంచి ఆక్వా ఉత్పత్తులు పెద్ద ఎత్తున విదేశాలకు ఎగుమతి అవుతున్నాయని, వీటికి మంచి ధర లభించాలంటే నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సిందేనని సూచించారు. శాస్త్రవేత్తల సూచనల మేరకే ఎరువులు, మందులు వాడాలని, భూసారాన్ని కాపాడుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఇప్పటికే 20 లక్షల ఎకరాల్లో రైతులు ప్రకృతి సేద్యం చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని, దీనికి గుర్తింపుగా స్విట్జర్లాండ్ నుంచి ‘ప్లానెట్ ఫుడ్ ప్రైజ్’ కూడా లభించిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్న పీఎం కిసాన్ పథకం కార్యక్రమాన్ని రైతులతో కలిసి సీఎం వర్చువల్గా వీక్షించారు. అనంతరం అన్నదాత సుఖీభవ పథకం తొలి విడత నిధులను విడుదల చేశారు. రాష్ట్రంలోని 46.86 లక్షల మంది రైతులకు రూ.3,125 కోట్ల చెక్కును అందించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం రైతులకు ఏటా రూ.20 వేల ఆర్థిక సాయం అందిస్తోందని, అందులో భాగంగా తొలి విడతగా రూ.7 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. గత ప్రభుత్వం హామీ ఇచ్చి రైతులను మోసం చేసిందని, తాము చెప్పిన మాట నిలబెట్టుకున్నామని అన్నారు.
ధాన్యం కొనుగోలు చేసి బకాయిలు పెట్టిన గత పాలకులలా కాకుండా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 48 గంటల్లోనే చెల్లింపులు చేస్తోందని చంద్రబాబు వివరించారు. విత్తన సరఫరా నుంచి మార్కెటింగ్ వరకు ప్రతి దశలోనూ రైతుకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పశ్చిమాసియా యుద్ధం, ఇతర కారణాలతో రైతులు నష్టపోకుండా చూస్తామన్నారు.
ఆక్వా రైతుల కోసం ఫీడ్ ధరను తగ్గించామని, తోతాపురి మామిడి, బర్లీ పొగాకు రైతులను ఆదుకున్నామని గుర్తుచేశారు. త్వరలోనే ప్రజాప్రతినిధులు ప్రతి రైతు ఇంటికీ వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని, పంట మార్పిడిపై అవగాహన కల్పిస్తారని ప్రకటించారు. 2027 ఏప్రిల్ నాటికి పోలవరం పూర్తి చేసి, రాష్ట్ర సాగునీటి కష్టాలు తీరుస్తామని పునరుద్ఘాటించారు.
రాష్ట్రంలో గొడ్డలి పార్టీకి విద్వేషాలు, విద్రోహాలు తప్ప అభివృద్ధి తెలీదని ముఖ్యమంత్రి ఆరోపించారు. ప్రతీ అంశంలోనూ విష ప్రచారమే ఆ పార్టీ అజెండా అని అన్నారు. విషం చిమ్మడం, అభివృద్ధిని ఆపటం, ప్రజల్ని ఇబ్బంది పెట్టటం తప్ప ఆ పార్టీకి మరేమీ తెలీదన్నారు.
రాష్ట్రాన్ని పరిశుభ్రంగా మార్చేందుకు స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు సీఎం తెలిపారు. ఇందులో భాగంగా కడప, కర్నూలులో రూ.330 కోట్ల వ్యయంతో 15 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ‘వేస్ట్ టూ ఎనర్జీ’ ప్లాంట్లకు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో 31 శాతంగా ఉన్న పచ్చదనాన్ని 50 శాతానికి పెంచుతామన్నారు.
గత ప్రభుత్వ పాలనపై 7 శ్వేతపత్రాలు విడుదల చేశామని, త్వరలోనే కూటమి రెండేళ్ల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్టును కూడా ప్రజల ముందు ఉంచుతామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్, ఎంపీ కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఏర్పాటు చేసిన వ్యవసాయ, ఉద్యాన స్టాళ్లను సీఎం పరిశీలించారు.