కొత్త ఓటరు నమోదుపై అబద్ధాలు నమ్మకండి: తెలంగాణ ‘సర్’ ప్రక్రియపై ఎస్ఈవో సుదర్శన్‌రెడ్డి
- కొత్త ఓటు హక్కు నమోదు చేసుకునే అవకాశం లేదంటూ తప్పుడు ప్రచారం
- బూత్ లెవెల్ ఆఫీసర్లు ప్రతి ఇంటికి వస్తారన్న ఎస్ఈవో సుదర్శన్ రెడ్డి
- కొత్త ఓటర్లు వారి వివరాలను నమోదు చేసుకోవచ్చని క్లారిటీ
తెలంగాణ ఓటర్లకు, యువతకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక అధికారిక అప్డేట్ ఇచ్చింది. రాష్ట్రంలో కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకునే అవకాశం లేదంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (ఎస్ఈవో) సుదర్శన్ రెడ్డి చెక్ పెట్టారు. ఓటరు జాబితా ప్రక్షాళన కోసం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై ఈరోజు హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించి పూర్తి వివరాలు వెల్లడించారు.
సుదర్శన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... ఈనెల జూన్ 25 నుంచి బూత్ లెవెల్ ఆఫీసర్లు తమ పరిధిలోని ప్రతి ఇంటికీ స్వయంగా రానున్నారు. వారు ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేస్తారు. ఈ వివరాల సేకరణ ప్రక్రియను పూర్తి చేసి జూలై 25 లోపు నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. ఎవరైనా కొత్తగా ఓటు హక్కు పొందాలనుకుంటే అదే ఫారంలో తమ వివరాలను నమోదు చేసుకోవచ్చని క్లారిటీ ఇచ్చారు.
ఓటరు జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా ఉండేందుకు ఇప్పటికే మ్యాపింగ్ వేగంగా సాగుతోంది. చాలా ప్రాంతాల్లో ఇప్పటికే 80 శాతం మ్యాపింగ్ పనులు పూర్తయ్యాయి. 2002 నాటి ఓటరు డేటాతో అనుసంధానమైన వారికి కొత్తగా ఎలాంటి ఇతర డాక్యుమెంట్లు అవసరం లేదు. వలస వచ్చిన వారు లేదా కొత్త ఓటర్ల కోసం ప్రభుత్వం జారీ చేసిన ప్రామాణిక పత్రాలను అనుమతిస్తామని సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ మొత్తం డ్రైవ్ పారదర్శకంగా సాగేందుకు డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా నియమించినట్లు సుదర్శన్‌రెడ్డి తెలిపారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి గందరగోళం లేకుండా ఉండేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిరంతరం సమావేశాలు ఏర్పాటు చేయాలని జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. అన్ని ప్రక్రియలు ముగించుకుని అక్టోబర్ 1వ తేదీన తెలంగాణ తుది ఓటరు జాబితాను అధికారికంగా ప్రచురిస్తామని తెలిపారు.