యోగా ఒక మతానికి పరిమితం కాదు.. అలా చూడటం మూర్ఖత్వం: వెంకయ్య నాయుడు
- సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా యోగా ఉత్సవాలు
- ప్రపంచానికి భారత్ అందించిన గొప్ప కానుక యోగా అన్న వెంకయ్య నాయుడు
- మనిషిని సమగ్ర మనిషిగా మార్చే అద్భుత సాధనం యోగా అని వ్యాఖ్య
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్ వేదికగా భారీ యోగా ఉత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు... యోగా విశిష్టతపై అత్యంత స్పష్టమైన, కీలకమైన వ్యాఖ్యలు చేశారు. యోగాను ఒక మత కోణంలో చూసే వారిపై ఆయన తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.
యోగా అనేది ఏ ఒక్క మతానికో, వర్గానికో పరిమితమైంది కాదని... దానికి మతాన్ని ఆపాదించి చూడటం ముమ్మాటికీ మూర్ఖత్వమే అవుతుందని వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. "ప్రపంచానికి భారతదేశం అందించిన అత్యంత గొప్ప అమూల్యమైన కానుక యోగా. ఇది కేవలం వ్యాయామం కాదు.. మనిషిని సమగ్ర మనిషిగా మార్చే అద్భుత సాధనం. మానవ చైతన్యానికి, సర్వమానవ సౌభ్రాతృత్వానికి ఇదొక నిదర్శనం. మానసిక ఒత్తిడిని దూరం చేసి, గుండె నిబ్బరాన్ని, ఆధ్యాత్మిక స్థైర్యాన్ని ఇచ్చే ఈ జీవన విధానాన్ని మన పూర్వీకులు మనకు అందించారు. ప్రకృతి ఒడిలో జీవిస్తూ ఆరోగ్యమే మహాభాగ్యం అనే మాటను ప్రతి ఒక్కరూ నిజం చేయాలి" అని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ మాట్లాడుతూ... విశ్వవ్యాప్తంగా యోగాకు వస్తున్న గుర్తింపు మన దేశానికి గర్వకారణమన్నారు. యోగా అనేది మన ప్రాచీన సంస్కృతిలో ఒక భాగమని, నేటి ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరికీ శారీరక, ఆరోగ్య చింతన ఎంతో అవసరమని పేర్కొన్నారు.
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు మాట్లాడుతూ... ప్రధాని మోదీ చొరవతోనే 12 సంవత్సరాల క్రితం యోగాకు అంతర్జాతీయంగా గుర్తింపు లభించిందని, నేడు ప్రపంచ దేశాలన్నీ యోగాను అనుసరిస్తున్నాయని గుర్తు చేశారు. డిప్రెషన్ లాంటి సమస్యలను దూరం చేయడానికి యోగా అద్భుతంగా పనిచేస్తుందని, పిల్లల నుండి పెద్దల వరకు అందరూ దీనిని రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు.