నిరాహార దీక్ష చేస్తా: కాంగ్రెస్ ప్రభుత్వానికి కవిత వార్నింగ్
- సింగరేణి బాయిబాట కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి జిల్లాలోని గనిని సందర్శించిన కవిత
- మెడికల్ అన్‌ఫిట్ కోసం దరఖాస్తు చేసుకున్న 1200 మంది వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్
- ఉద్యోగాలు ఇవ్వకపోతే జులై 20 నుంచి నిరాహార దీక్షకు కూర్చుంటానని హెచ్చరిక
సింగరేణి ‘బాయిబాట’ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కేటీకే-5 గనిని సందర్శించారు. ఈ సందర్భంగా కార్మికుల సమస్యలపై ఆమె మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వంపై, సింగరేణి యాజమాన్యంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సింగరేణిలో మెడికల్ అన్‌ఫిట్ కోసం దరఖాస్తు చేసుకుని పెండింగ్‌లో ఉన్న దాదాపు 1200 మంది వారసులకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి ఒక నెల రోజులు టైమ్ ఇస్తున్నామని, ఆలోగా ప్రక్రియ పూర్తి చేయకపోతే జులై 20 నుంచి తాను నిరాహార దీక్షకు కూర్చుంటానని హెచ్చరించారు.
సింగరేణిలో ఏ చిన్న పని జరగాలన్నా నేరుగా డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచే లంచాలు అడుగుతున్నారంటూ కవిత సంచలన ఆరోపణ చేశారు. కాంగ్రెస్ పాలనలో లాభాల్లో ఉన్న సింగరేణిని నష్టాల్లోకి నెట్టేస్తున్నారని మండిపడ్డారు. మొన్న జరిగిన ప్రమాదంలో ఒక కార్మికుడికి తీవ్ర గాయాలవడానికి యాజమాన్యం వాడుతున్న నాసిరకం డిటోనేటర్లే కారణమన్నారు. గనుల లోపల పని చేసే కార్మికులకు కనీసం స్వచ్ఛమైన గాలి, మంచి నీరు కూడా ఇవ్వకుండా అధికారులు కక్కుర్తి పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రిటైర్ అయిన కార్మికులకు సొంత ఇంటి కల నెరవేర్చడం కోసం సింగరేణికి ప్రత్యేకంగా ‘హౌసింగ్ బోర్డు’ ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం లేదా కార్మిక సంఘం తరఫున రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందించాలన్నారు. అలాగే విజిలెన్స్ ఎంక్వయిరీల పేరుతో కార్మికులను భయభ్రాంతులకు గురిచేయవద్దని అన్నారు. ఉద్యమ కాలం నుంచే తాను సింగరేణి కార్మికులతో కలిసి నడిచానని గుర్తుచేసిన కవిత... తెలంగాణ హక్కుల కోసం తాను స్థాపించిన ‘తెలంగాణ రక్షణ సేన’ పార్టీని భూపాలపల్లి ప్రజలు, బొగ్గుగని కార్మికులు గుండెల్లో పెట్టుకుని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.