లైక్స్ కోసం రిస్క్.. పవిత్రమైన హారతితో ప్రమాదకర ప్రాంక్.. యువతిపై విమర్శలు
- కోల్‌కతాలో హారతి పేరుతో ఇద్దరు యువతుల ప్రమాదకర ప్రాంక్
- శానిటైజర్‌తో చేతులు కడిగించి నిప్పు అంటించిన వైనం
- లైక్స్, వ్యూస్ కోసం పవిత్రమైన కర్మను అపహాస్యం చేశారని విమర్శలు
ఈ వైరల్ వీడియోలో, ఇద్దరు యువతులు రోడ్డుపై వెళ్లేవారిని ఆపి హారతి ఇస్తామని నమ్మించారు. ముందుగా చేతులు శుభ్రం చేసుకోవాలని కోరుతూ, నీటిలా భ్రమింపజేస్తూ బాధితులకు హ్యాండ్ శానిటైజర్ ఇచ్చారు. వారు శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకున్న అనంతరం, హారతి పళ్లెంలోని దీపాన్ని చేతుల వద్దకు తీసుకురాగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో బాధితులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే, ఇదంతా కేవలం ఒక ప్రాంక్ మాత్రమేనని సదరు యువతులు ఆ తర్వాత వెల్లడించారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ అయిన కొద్దిసేపటికే వైరల్ అయ్యింది. ఇది అత్యంత మూర్ఖపు చర్య అని, కేవలం వీడియోల కోసం ఇలాంటి ప్రమాదకరమైన పనులు చేయడమేమిటని నెటిజన్లు మండిపడుతున్నారు. శానిటైజర్‌తో ఇలాంటి ప్రాంక్‌లు చేయడం వల్ల ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందని పలువురు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
సిమ్రాన్_కోల్_9 అనే హ్యాండిల్‌కు చెందిన ఇన్ఫ్లుయెన్సర్గా సదరు యువతిని గుర్తించారు. కేవలం పాప్యులారిటీ కోసం పవిత్రమైన సంప్రదాయాలను అపహాస్యం చేయడమే కాకుండా, ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది ఈ చర్యను వెనకేసుకొస్తున్నప్పటికీ, అత్యధికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సదరు యువతులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.