కాబోయే భార్య కళ్లముందే.. ఫొటోలు తీస్తూ లోయలోకి జారి రియల్ ఎస్టేట్ డైరెక్టర్ దుర్మరణం
- కాబోయే భార్య పుట్టినరోజు వేడుక కోసం లోహగడ్ కోటకు వెళ్లిన కేతన్ అగర్వాల్
- కోట శిఖరం అంచున ఫోటోలు తీసుకుంటూ అదుపు తప్పి లోయలో పడిన వైనం
- రియల్ ఎస్టేట్ సంస్థ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కేతన్
- రెస్క్యూ బృందాలు శ్రమించి యువకుడి మృతదేహం వెలికితీత
- నవంబర్‌లో జైపూర్‌లో వివాహం.. రెండు కుటుంబాల్లో తీరని శోకం
పుణెలోని గహుంజే ప్రాంతానికి చెందిన కేతన్ అగర్వాల్ తమ కుటుంబానికి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ నిర్మాణ సంస్థలో డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. నవంబర్‌లో రాజస్థాన్‌లోని జైపూర్‌లో వీరికి వివాహం జరగాల్సి ఉంది. ఇందుకోసం ఇరు కుటుంబాల వారు ఇప్పటికే భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ఈ తరుణంలో కాబోయే భార్య పుట్టినరోజు రావడంతో, ఆనందంగా గడపడానికి గురువారం ఉదయం స్నేహితులతో కలిసి లోహగడ్ కోటకు ట్రెకింగ్‌కు వెళ్లారు. అక్కడ ప్రకృతి అందాలను కెమెరాలో బంధించే క్రమంలో కేతన్ పాదం జారడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.
ప్రమాదం జరిగిన వెంటనే స్నేహితులు ఇచ్చిన సమాచారంతో లోనవాలా పోలీసులు, స్థానిక శివదుర్గ్ రెస్క్యూ బృందం ఘటనా స్థలానికి చేరుకున్నారు. అత్యంత ప్రమాదకరంగా ఉన్న ఆ లోయలోకి రెస్క్యూ సిబ్బంది తాడు సాయంతో దిగి, కేతన్ అగర్వాల్ మృతదేహాన్ని వెలికితీశారు. పోలీసుల ప్రాథమిక విచారణలో ఇది కేవలం ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనేనని తేలింది. ఈ ఘటనతో రెండు కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.