83 ఏళ్ల వయసులోనూ అమితాబ్‌కు నిద్రలేని రాత్రులు.. బిగ్‌బీని వేధిస్తున్న ఆ ఆలోచన ఏంటి?

Amitabh Bachchan sleepless nights at age 83 what is bothering Big B
  • పనిలో కుర్ర హీరోలతో పోటీ పడుతున్న అమితాబ్‌
  • ఓ సినిమా షూటింగ్‌కు సంబంధించిన విశేషాలు పంచుకున్న బిగ్‌ బీ
  • దాంట్లో ఓ సీన్‌ బాగా రాలేదని రెండోసారి షూట్‌ చేసినట్లు వెల్లడి
  • అది ఎలా వచ్చిందోనని నిద్ర పట్టలేదని పేర్కొన్న వైనం
  • ప్రేక్షకులే తేల్చాలంటూ బ్లాగ్ పోస్ట్‌
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (బిగ్‌ బీ) 83 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోలకు పోటీనిస్తూ వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. వయసు కేవలం అంకె మాత్రమేనని నిరూపిస్తూ ఆయన చూపిస్తున్న అంకితభావం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అయితే తాజాగా ఆయన తన బ్లాగ్‌లో పంచుకున్న ఓ పోస్ట్ వైరల్‌గా మారింది. గత కొన్ని రోజులుగా పనికి సంబంధించిన ఆలోచనల వల్ల తనకు రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదని అమితాబ్ వెల్లడించారు.

ఒక షూటింగ్ పూర్తి చేసిన తర్వాత ఆ సీన్‌ను ఇంకా బాగా చేసి ఉండాల్సింది అనే అసంతృప్తి అమితాబ్‌లో కలిగిందట. దాంతో డైరెక్టర్ అనుమతి తీసుకుని ఆ సీన్‌ను మళ్లీ రీ-షూట్ చేశారు. అయితే రెండోసారి చేసిన ఔట్‌పుట్ మొదటిదానికంటే బాగా వచ్చిందా లేదా అనే సందేహాలు, ఆలోచనలు ఆయన్ను రాత్రంతా వెంటాడాయట. ఆ టెన్షన్ వల్ల కనురెప్ప మూయకుండానే తెల్లవారిపోయిందని, ఈ విషయం ప్రేక్షకులు చూశాకే తేలుతుందని తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు.

గత వారం కూడా అమితాబ్ తన హెవీ వర్క్ షెడ్యూల్ గురించి అభిమానులతో పంచుకున్నారు. ఒక్క రోజులోనే ఏకంగా 12 షార్ట్ ఫిల్మ్స్ (యాడ్స్), 2 స్టిల్ షూట్స్ పూర్తి చేశానని, పని ఎప్పుడూ ఆపకూడదని పేర్కొన్నారు. తన అభిమానులను ‘ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీ’గా పిలిచే బిగ్‌బీ.. ఎంత అలసిపోయినా రాత్రి 3 గంటలకు కూడా వారితో బ్లాగ్ ద్వారా టచ్‌లో ఉండటం విశేషం.

ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ చేతినిండా క్రేజీ ప్రాజెక్టులతో ఉన్నారు. పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ సినిమా ‘కల్కి 2898 AD’ సీక్వెల్‌లో ఆయన మళ్లీ ‘అశ్వత్థామ’గా కనిపించనున్నారు. దీనితో పాటు రణ్‌బీర్ కపూర్ ‘రామాయణ: పార్ట్ 1’, అలాగే ‘సెక్షన్ 84’ చిత్రాల్లో ఆయన కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Go Back to Shorts
Amitabh Bachchan
Bollywood Megastar
Kalki 2898 AD Sequel
Amitabh Bachchan Blog
Ashwatthama
Section 84 Movie

More Telugu News