అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం ఎఫెక్ట్.. హర్మూజ్ తెరుచుకోవడంతో దెబ్బకు పడిపోయిన చమురు ధరలు

  • హ‌ర్మూజ్ జలసంధి గుండా తిరిగి ప్రారంభమైన ట్యాంకర్ల రవాణా
  • మార్కెట్లోకి 85 మిలియన్ బ్యారెళ్ల చమురు వ‌చ్చే అవకాశం
  • ఎగుమతులు పునఃప్రారంభించేందుకు సిద్ధమైన కువైట్, ఇరాక్
అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఈరోజు భారీగా తగ్గుముఖం పట్టాయి. కీలకమైన హ‌ర్మూజ్ జలసంధి గుండా ఆయిల్ ట్యాంకర్ల రాకపోకలు తిరిగి ప్రారంభం కావడంతో మార్కెట్‌లోకి సరఫరా పెరగనుందన్న అంచనాలతో ధరలు దిగివచ్చాయి. బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ధర 54 సెంట్లు (0.68%) తగ్గి 78.31 డాలర్ల వద్ద ట్రేడ్ అవ్వగా, యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డ‌బ్ల్యూటీఐ) క్రూడ్ ఆయిల్ ధర 46 సెంట్లు (0.60%) తగ్గి 76.14 డాలర్లకు చేరింది. నిన్న‌ ఈ రెండు సూచీలు మార్చి ప్రారంభం తర్వాత అత్యంత కనిష్ఠ స్థాయిని తాకాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో శాంతి ఒప్పందంపై సంతకం చేసిన కొన్ని గంటల్లోనే, సౌదీ అరేబియాకు చెందిన మూడు ట్యాంకర్లు సహా పలు నౌకలు హ‌ర్మూజ్ జలసంధిని దాటాయి. ఈ మూడు ట్యాంకర్లలోనే దాదాపు 6 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు ఉంది. విశ్లేషకుల అంచనా ప్రకారం మధ్యప్రాచ్య గల్ఫ్‌లో నిలిచిపోయిన 85 మిలియన్ బ్యారెళ్లకు పైగా చమురు రాబోయే రోజుల్లో ప్రపంచ మార్కెట్లలోకి వ‌చ్చే  అవకాశం ఉంది. దీనికి తోడు ఇరాన్ చమురుపై అమెరికా ఆంక్షలను ఎత్తివేయనుండటంతో సరఫరా మరింత పెరగనుంది.

ప‌శ్చిమాసియాలోని ఇతర దేశాలు కూడా ఎగుమతులను పునఃప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. యుద్ధ సమయంలో విధించిన అన్ని ఫోర్స్ మేజర్ నోటీసులను తక్షణమే ఎత్తివేసినట్లు కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ నిన్న‌ ప్రకటించింది. తమ ఆయిల్‌ఫీల్డ్‌లు ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నాయని, సాధారణ ఉత్పత్తి స్థాయికి క్రమంగా చేరుకుంటామని ఇరాక్ చమురు శాఖ మంత్రి బాసిమ్ మహమ్మద్ తెలిపారు.

అయితే, హ‌ర్మూజ్ జలసంధి గుండా ట్యాంకర్ల రద్దీ పూర్తిగా సాధారణ స్థితికి చేరుకుందని నిర్ధారించుకునే వరకు ట్రేడర్లు వేచి చూసే ధోరణిలో ఉన్నారని మార్కెట్ నిపుణులు అంటున్నారు. నౌకల రాకపోకలు నిలకడగా కొనసాగితేనే ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని కేసీఎం చీఫ్ మార్కెట్ అనలిస్ట్ టిమ్ వాటరర్ అభిప్రాయపడ్డారు.

యుద్ధానికి ముందు ప్రపంచంలోని చమురు, ద్రవీకృత సహజ వాయువులో (ఎల్ఎన్‌జీ) ఐదో వంతు ఈ జలసంధి గుండానే రవాణా అయ్యేది. అయితే, ప్రస్తుతం లెబనాన్‌లోని హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ తన యుద్ధాన్ని కొనసాగిస్తుండటం ఈ శాంతి ఒప్పందంపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తోంది. అమెరికా-ఇరాన్ ఒప్పందం ఎంతకాలం నిలుస్తుందనే దానిపై ఈ పరిణామం ప్రశ్నలను లేవనెత్తుతోంది.

Crude Oil Prices
US Iran Peace Agreement
Strait of Hormuz
Brent Crude
Donald Trump
Global Oil Supply

More Telugu News