కశ్మీర్ అంశంపై పాక్‌కు భారత్ కౌంటర్.. ఐరాసలో అనుపమా సింగ్ ఫైర్

India counter to Pakistan on Kashmir issue Anupama Singh fires at UN
  • ఐరాసలో మళ్లీ జమ్మూ కశ్మీర్‌ అంశాన్ని ప్రస్తావించిన పాక్‌
  • దీటుగా బదులిచ్చిన భారత దౌత్యాధికారి అనుపమా సింగ్‌
  • ఉగ్రవాదులకు శిక్షణనివ్వడం వారి అధికారిక విధానమని స్పష్టీకరణ
  • పీఓకేలో పరిస్థితులను వివరిస్తూ పాక్‌ ను ఎండగట్టిన భారత్‌
  • సింధూ జలాల ఒప్పందం నేటి పరిస్థితులకు అనుగుణంగా లేదని స్పష్టీకరణ
ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్ మరోసారి పాకిస్థాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పింది. జమ్మూ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించిన పాకిస్థాన్ ప్రతినిధికి భారత శాశ్వత మిషన్ ఫస్ట్ సెక్రటరీ అనుపమ సింగ్‌ గట్టి సమాధానం ఇచ్చారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం, శిక్షణ ఇవ్వడం, వారిని ప్రభుత్వ విధానంలో భాగంగా ఉపయోగించడం పాక్‌కు అలవాటైందని ఆరోపించారు.

ఐరాస మానవ హక్కుల హైకమిషనర్ వార్షిక నివేదికపై జరిగిన చర్చ సందర్భంగా భారత ‘రైట్ ఆఫ్ రిప్లై’ వినియోగించిన అనుపమా సింగ్.. జమ్మూ కశ్మీర్ విషయంలో భారత్ వైఖరిని మరోసారి స్పష్టం చేశారు. ‘‘జమ్మూ-కశ్మీర్ గతంలోనూ, ప్రస్తుతం, భవిష్యత్తులోనూ భారతదేశంలో అంతర్భాగంగానే ఉంటుంది. పరిష్కారం కావాల్సిన ఏకైక అంశం పాకిస్థాన్ అక్రమంగా ఆక్రమించిన భారత భూభాగాలను తిరిగి అప్పగించడమే’’ అని స్పష్టం చేశారు.

అనంతరం పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ పరిస్థితులను ప్రస్తావిస్తూ అక్కడ జరుగుతున్న అణచివేతపై అనుపమ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రావట్‌కోట్‌లో ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనలను ఉదహరించారు. ప్రజలు ఆహారం, విద్యుత్, ప్రాథమిక హక్కులు, గౌరవప్రద జీవితం కోసం నిరసన తెలుపుతుంటే బుల్లెట్లు, బలప్రయోగంతో వారి గొంతు నొక్కేస్తున్నారని తెలిపారు.

ఈ సందర్భంగా పాకిస్థాన్ తనను తాను ఉగ్రవాద బాధిత దేశంగా పేర్కొనడాన్ని కూడా అనుపమా సింగ్ ఎద్దేవా చేశారు. ‘‘ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చి, శిక్షణ ఇచ్చి, వారిని విదేశాలకు పంపించడం ప్రభుత్వ విధానమని ఆ దేశ రక్షణ మంత్రి స్వయంగా అంగీకరించారు. అయినప్పటికీ పాక్‌ తనను తాను ఉగ్రవాద బాధిత దేశంగా చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది’’ అని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్‌ను‘‘తానే సృష్టించిన రాక్షసుడు తిరిగి తనపైనే దాడి చేస్తే ఆశ్చర్యపోతున్న దేశం పాకిస్థాన్. ప్రపంచంలో అలాంటి విరుద్ధ పరిస్థితిని కొనసాగించగలిగిన దేశం బహుశా పాకిస్థాన్ మాత్రమే’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సింధూ జలాల ఒప్పందం అంశంపైనా భారత్ తన వైఖరిని పునరుద్ఘాటించింది. ఉగ్రవాదాన్ని విదేశాంగ విధానంలో భాగంగా ఉపయోగించే దేశం.. సహకార ఒప్పందాల ప్రయోజనాలను కోరడం సమంజసం కాదని అనుపమా సింగ్ పేర్కొన్నారు. 1960లో కుదిరిన ఈ ఒప్పందం నేటి పరిస్థితులకు అనుగుణంగా లేదని, గత ఆరు దశాబ్దాల్లో ప్రపంచ పరిస్థితులు, సాంకేతిక పరిజ్ఞానం, జనాభా అవసరాలు పూర్తిగా మారిపోయాయని స్పష్టం చేశారు.
Go Back to Shorts
Anupama Singh
United Nations
Jammu Kashmir
Pakistan Occupied Kashmir
India Pakistan UN
Terrorism Pakistan

More Telugu News