అంతరించిపోతున్న పక్షి జాతికి పునర్జన్మ.. రాజస్థాన్‌లో మూడు కొత్త పిల్లల జననం!

  • 94కు చేరిన బ్రీడింగ్ సెంటర్లలోని పక్షుల మొత్తం సంతతి
  • కృత్రిమ గర్భధారణ ద్వారా రెండు, సహజసిద్ధంగా ఒక పిల్ల జననం
  • అంతరించిపోతున్న జాతిని కాపాడేందుకు ఫలించిన ప్రయత్నాలు
ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్న అత్యంత అరుదైన పక్షి జాతి 'గ్రేట్ ఇండియన్ బస్టర్డ్' (బట్టమేక పక్షి)ను కాపాడుకునేందుకు రాజస్థాన్ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్ఠాత్మక సంరక్షణ కార్యక్రమం అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. జైసల్మేర్‌లోని పక్షుల ప్రజనన (సంతానోత్పత్తి) కేంద్రాలలో తాజాగా మూడు కొత్త పక్షి పిల్లలు విజయవంతంగా జన్మించాయి. దీంతో ఈ కేంద్రాలలో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పక్షుల సంఖ్య 94కు చేరుకుందని అటవీ శాఖ అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. అంతరించిపోతున్న ఈ పక్షి జాతిని కాపాడటంలో సాధించిన ఈ విజయంపై కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ హర్షం వ్యక్తంచేశారు.

జైసల్మేర్ జిల్లాలోని సుదసరి, రామ్‌దేవ్రా అనే రెండు ప్రత్యేక కేంద్రాలలో 2018 నుంచి ఈ సంరక్షణ ప్రాజెక్ట్ నడుస్తోంది. తాజాగా పుట్టిన మూడు పిల్లలలో.. ఒక పక్షి పిల్ల.. అడవి నుంచి  సేకరించిన గుడ్డు ద్వారా జన్మించగా, మిగిలిన రెండు పిల్లలు శాస్త్రవేత్తలు చేసిన కృత్రిమ గర్భధారణ ప్రయోగం ద్వారా జన్మించడం విశేషం. ఈ కేంద్రాలలోని నిపుణులు పక్షులను 24 గంటల పాటు నిరంతరం పర్యవేక్షిస్తూ, శాస్త్రీయ పద్ధతుల ద్వారా గుడ్లను పొదిగించి పిల్లలను పెంచుతున్నారు. అడవిలో క్రూర జంతువుల నుంచి గుడ్లను కాపాడటమే కాకుండా, పక్షులలో జన్యుపరమైన వైవిధ్యాన్ని పెంపొందించడానికి ఈ పద్ధతి ఎంతగానో ఉపయోగపడుతుందని డివిజనల్ అటవీ అధికారి బ్రిజ్మోహన్ గుప్తా తెలిపారు.

ప్రస్తుతం సంతానోత్పత్తి కాలం ఇంకా కొనసాగుతుండటంతో మరికొన్ని గుడ్లను నిశితంగా గమనిస్తున్నామని, రాబోయే రోజుల్లో పక్షుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. కేవలం సంతానోత్పత్తి మాత్రమే కాకుండా, ఈ పక్షుల మనుగడకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు రామ్‌దేవ్రా సమీపంలో దాదాపు రూ. 6.25 కోట్ల వ్యయంతో 64 మీటర్ల పొడవైన భూగర్భ మార్గాన్ని కూడా నిర్మిస్తున్నారు. ఇది పక్షుల నివాస ప్రాంతాలను అనుసంధానించడానికి, వాటి ప్రాణాలకు రక్షణ కల్పించడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఎన్నో ఏళ్లుగా అడవుల్లో అంతరించిపోతున్న రాజస్థాన్ రాష్ట్ర పక్షికి ఈ శాస్త్రీయ సంరక్షణ చర్యలు సరికొత్త ఆశలను ఇస్తున్నాయి.

Great Indian Bustard
Rajasthan Wildlife
Jaisalmer
GIB Recovery Programme
Bird Conservation
Bhupender Yadav

More Telugu News