అమెరికాలో హెచ్-1బీ దోపిడీ.. రూ.94 లక్షలు కట్టించుకున్నారని యజమానిపై భారత టెక్కీ దావా

  • ఉద్యోగం, వీసా నిలబెట్టుకోవడానికి రూ.94 లక్షలు వసూలు చేశారని ఆరోపణ
  • టెక్సాస్‌కు చెందిన ఐటీ కంపెనీ, దాని సీఈఓపై భారత టెక్కీ దావా
  • ఇమ్మిగ్రేషన్ అధికారులకు అప్పగిస్తామని బెదిరించి డబ్బులు గుంజినట్లు ఫిర్యాదు
  • హెచ్-1బీ వీసాదారుల బలహీనతలను ఆసరాగా చేసుకుని జరుగుతున్న దోపిడీపై చర్చ
అమెరికాలో ఉద్యోగం, చట్టబద్ధమైన నివాసం కోసం వెళ్లిన భారతీయ టెక్నాలజీ నిపుణుడికి తీవ్రమైన వేధింపులు ఎదురయ్యాయి. హెచ్-1బీ వీసాపై ఉన్న తన బలహీనతను ఆసరాగా చేసుకుని, ఉద్యోగం నిలబెట్టుకోవాలంటే డబ్బులు చెల్లించాలంటూ యజమాని తనను దోపిడీ చేశాడని ఆరోపిస్తూ ఓ భారతీయ టెక్కీ టెక్సాస్‌లోని ఫెడరల్ కోర్టును ఆశ్రయించాడు. తన యజమాని దాదాపు లక్ష డాలర్లు (సుమారు రూ.94 లక్షలు) బలవంతంగా వసూలు చేశారని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

వివరాల్లోకి వెళితే.. రిషికేశ్ రాజ్ మీసాల అనే హెచ్-1బీ వీసాదారుడు.. తాను పనిచేస్తున్న టెక్సాస్‌లోని 'ప్రోగ్రెస్ సొల్యూషన్స్ ఇంక్' అనే ఐటీ సంస్థపైనా, దాని భారత సంతతి సీఈఓ సాయి జితేందర్ కలగ్రాపైనా ఈ దావా వేశారు. తనను బలవంతంగా వెట్టిచాకిరీ చేయించారని, వేతనాల్లో కోత విధించారని, దేశం నుంచి వెళ్లగొడతామని బెదిరించారని ఆయన ఆరోపించారు. 

ఫిర్యాదు ప్రకారం రాజ్ మీసాల విధుల్లో చేరిన మొదటి రోజే క్లయింట్ ప్రాజెక్టులు ఉన్నప్పటికీ, అతడిని జీతం లేకుండా 'బెంచ్‌'పై ఉంచారు. అంతేగాక‌ కంపెనీ పే స్లిప్పులు ఇవ్వలేదని, వేతనాలు సరిగ్గా చెల్లించలేదని పేర్కొన్నారు. ఉద్యోగం, గ్రీన్ కార్డ్ స్పాన్సర్‌షిప్ ప్రక్రియను కొనసాగించాలంటే డబ్బులు చెల్లించాలని ఒత్తిడి తెచ్చారని ఆయ‌న తెలిపారు. ఫిర్యాదు చేస్తే ఇమ్మిగ్రేషన్ అధికారులకు (ఐసీఈ) అప్పగిస్తామని, "ఐస్ చూసుకుంటుంది" అంటూ బెదిరించినట్లు తెలిపారు. ఈ బెదిరింపుల కారణంగా తీవ్రమైన మానసిక వేదనకు, ఆందోళనలకు గురైనట్లు ఆయన చెప్పారు.

ఈ దావా ద్వారా తనకు రావాల్సిన వేతన బకాయిలు, బలవంతంగా వసూలు చేసిన మొత్తాన్ని నష్టపరిహారంతో పాటు ఇప్పించాలని కోర్టును అభ్యర్థించారు. మిచిగాన్‌లో నివసిస్తున్న మీసాల, టెక్సాస్‌కు చెందిన ఈ ఐటీ స్టాఫింగ్ సంస్థలో చేరిన తర్వాత ఈ వేధింపులు ఎదుర్కొన్నట్లు తెలిపారు.

ఈ కేసు హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌లోని లోపాలను, ముఖ్యంగా భారత్ నుంచి వెళ్లే ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. వీసా స్పాన్సర్‌షిప్‌పై ఆధారపడి జీవిస్తున్న అనేకమంది ఉద్యోగులు, యజమానుల దోపిడీకి, బెంచింగ్‌కు, బలవంతపు వసూళ్లకు గురవుతున్నారనే ఆందోళనలు చాలాకాలంగా ఉన్నాయి. ఈ ఆరోపణలపై ఇప్పటివరకు కంపెనీ గానీ, సీఈఓ కలగ్రా గానీ ఇంకా స్పందించలేదు. ఈ కేసు విచారణ  నవంబర్‌లో జరగనుంది. ఈ పరిణామం హెచ్-1బీ వ్యవస్థలో కార్మికుల రక్షణ, నిబంధనల అమలుపై చర్చకు దారితీసింది.

H1B visa lawsuit
Rishikesh Raj Misala
Progress Solutions Inc
Sai Jitender Kalagra
Indian techie US lawsuit
H1B visa exploitation

More Telugu News