అనితపై అనుచిత వ్యాఖ్యలు.. గుడివాడ అమర్నాథ్పై మహిళా కమిషన్ సీరియస్
- అనితను 'మేకప్ మంత్రి' అన్న గుడివాడ అమర్నాథ్
- అమర్నాథ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన రాయపాటి శైలజ
- సమన్లు ఇచ్చేందుకు రెడీ అవుతున్న మహిళా కమిషన్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలు హద్దులు దాటుతున్నాయి. హోంమంత్రి వంగలపూడి అనితను ఉద్దేశించి వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. మహిళా మంత్రిని ‘మేకప్ మంత్రి’ అని సంబోధిస్తూ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ తీవ్రంగా ఖండించారు.
రాజకీయాల్లో విధానాలపై విమర్శలు ఉండాలి గానీ, ఒక మహిళా ప్రజాప్రతినిధి రూపం, దుస్తులు, మేకప్ గురించి మాట్లాడటం ఏమాత్రం సమర్థనీయం కాదని రాయపాటి శైలజ స్పష్టం చేశారు. ఇది హోంమంత్రిని మాత్రమే కాకుండా మొత్తం మహిళా సమాజాన్ని కించపరచడమేనని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా మహిళా రిజర్వేషన్లపై చర్చ జరుగుతున్న వేళ, ఇలాంటి బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు మరికొంత మంది మహిళలు రాజకీయాల్లోకి రాకుండా నిరుత్సాహపరుస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. నైతిక విలువలు లేనివారు నాయకులు కాలేరని హితవు పలికారు.
ఈ వ్యవహారాన్ని మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణిస్తోంది. కేవలం వ్యాఖ్యలు చేయడమే కాకుండా, వాటిని సమర్థించుకునేలా అమర్నాథ్ మాట్లాడటంపై కమిషన్కు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీకి లేఖ రాయాలని నిర్ణయించింది. అలాగే గుడివాడ అమర్నాథ్కు సమన్లు జారీ చేయనుంది.