సువేందు అధికారిపై మమత న్యాయపోరాటం.. భవానీపూర్ ఫలితంపై పిటిషన్
- భవానీపూర్ ఎన్నికల ఫలితంపై హైకోర్టులో మమత పిటిషన్
- సీఎం సువేందు అధికారి విజయాన్ని సవాల్ చేసిన దీదీ
- 15,015 ఓట్ల తేడాతో ఓటమిని ప్రశ్నించిన తృణమూల్ అధినేత్రి
- కౌంటింగ్లో అక్రమాలు జరిగాయని పిటిషన్లో ఆరోపణ
- 2021 నందిగ్రామ్ తర్వాత మళ్లీ సువేందుపై కోర్టుకెక్కిన మమత
ఇటీవల జరిగిన ఎన్నికల్లో భవానీపూర్ నియోజకవర్గంలో బీజేపీ నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి సువేందు అధికారి చేతిలో మమతా బెనర్జీ 15,015 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఒకప్పుడు టీఎంసీకి కంచుకోటగా ఉన్న ఈ స్థానంలో ఓడిపోవడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని, ఫలితాలపై న్యాయవిచారణ జరపాలని ఆమె తన పిటిషన్లో కోరారు. ఎన్నికలకు సంబంధించిన రికార్డులను భద్రపరచాలని కూడా విజ్ఞప్తి చేశారు.
2026 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సాధించి, సువేందు అధికారి నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే, సువేందు అధికారిపై మమతా బెనర్జీ కోర్టును ఆశ్రయించడం ఇది రెండోసారి. 2021 ఎన్నికల్లో నందిగ్రామ్ నియోజకవర్గంలో సువేందు చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయినప్పుడు కూడా మమత హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ ఇప్పటికీ కోర్టులో పెండింగ్లో ఉంది. తాజా పరిణామంతో మమత, సువేందు మధ్య రాజకీయ వైరం మరింత తీవ్రస్థాయికి చేరింది. ఈ పిటిషన్పై బీజేపీ గానీ, సువేందు అధికారి గానీ తక్షణమే స్పందించలేదు.