ఇండియా-శ్రీలంక ‘ఎ’ సిరీస్‌లో రచ్చ.. శ్రీలంక ఆటగాళ్లపై కెప్టెన్ తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!

  • నిన్న మ్యాచ్ ముగిసిన తర్వాత వైభవ్ సూర్యవంశీని స్లెడ్జ్ చేసిన హలంబగే
  • శ్రీలంక ఆటగాళ్ల తీరు తనకు నచ్చలేదన్న తిలక్ వర్మ
  • సూర్యవంశీని శ్రీలంక ఆటగాళ్లు రెచ్చగొట్టారని విమర్శ

డంబుల్లా వేదికగా ఇండియా-ఎ, శ్రీలంక-ఎ జట్ల మధ్య జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్ మ్యాచ్‌ ముగిసినా, ఆ తర్వాత రేగిన వివాదం మాత్రం అంతకంతకూ ముదురుతోంది. సూపర్ ఓవర్‌లో శ్రీలంక జట్టు విజయం సాధించిన అనంతరం.. భారత యువ సంచలనం, కేవలం 15 ఏళ్ల వయసున్న వైభవ్ సూర్యవంశీ మరియు శ్రీలంక ప్లేయర్ విశెన్ హలంబగే మధ్య మైదానంలోనే తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇద్దరూ కొట్టుకునేంత పనిచేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా, తాజాగా ఈ రచ్చపై భారత జట్టు కెప్టెన్ తిలక్ వర్మ ప్రెస్ మీట్‌లో సంచలన వ్యాఖ్యలు చేస్తూ లంక ప్లేయర్లపై విరుచుకుపడ్డాడు.


ఆ చిన్న పిల్లాడితో అలా ప్రవర్తించడం నచ్చలేదు
శ్రీలంక ఆటగాళ్ల ప్రవర్తనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన తిలక్.. "నేను ఇక్కడ ఎవరికీ క్లాసులు తీసుకోవడానికి లేను. కానీ 15 ఏళ్ల చిన్న వయసున్న వైభవ్ సూర్యవంశీతో శ్రీలంక ఆటగాళ్లు ప్రవర్తించిన తీరు నాకు అస్సలు నచ్చలేదు" అని ఓపెన్‌గా స్టేట్‌మెంట్ ఇచ్చాడు.


అసలు గొడవ ఎలా మొదలైందనే దానిపై క్లారిటీ ఇస్తూ.. "అక్కడ ఏం జరిగిందో నాకు పూర్తిగా తెలియదు కానీ, ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పగలను. మ్యాచ్ ముగిసిన తర్వాత వైభవ్ చాలా ప్రశాంతంగా వెళ్తున్నాడు. కానీ శ్రీలంక ఆటగాళ్లే అనవసరంగా అతడిని రెచ్చగొట్టి, గొడవకు దిగారు. ఇది జెంటిల్‌మెన్ గేమ్ అయిన క్రికెట్‌కు అస్సలు మంచిది కాదు. అంతేకాదు, భారత్-శ్రీలంక దేశాల మధ్య ఉన్న క్రీడా సంబంధాలను కూడా ఇలాంటి ఘటనలు దెబ్బతీస్తాయి" అని తిలక్ వర్మ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు.


మ్యాచ్‌లలో గెలుపోటములు సహజమే అయినా.. గెలిచిన ఆవేశంలో కేవలం 15 ఏళ్ల కుర్రాడిపై శ్రీలంక సీనియర్ ప్లేయర్లు స్లెడ్జింగ్‌కు దిగడం, గొడవ పడటంపై ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. కెప్టెన్‌గా తిలక్ వర్మ తన జూనియర్ ప్లేయర్‌కు అండగా నిలబడి లంక బోర్డుకు గట్టి మెసేజ్ పంపాడని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.


Tilak Varma
Vaibhav Suryavanshi
India A vs Sri Lanka A
Cricket controversy
Dambulla tri series
Sri Lanka cricket team

More Telugu News