ఖాళీ కడుపుతో బ్లాక్‌ కాఫీ తాగుతున్నారా? ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!

  • కెఫిన్‌ వేగంగా శరీరంలోకి ప్రవేశం
  • కొందరిలో ఆందోళన పెరిగే అవకాశం
  • గుండె దడ, చిరాకు లక్షణాలు
  • మానేయాల్సిన అవసరం లేదని డాక్టర్ల సూచన
  • అల్పాహారం తర్వాత తాగితే మంచిదని హితవు
ఉదయం నిద్ర లేచిన కాసేపటికే కొందరికి కాఫీ తాగకపోతే రోజు మొదలైనట్లే అనిపించదు. ముఖ్యంగా బ్లాక్‌ కాఫీ తాగే వాళ్లు రోజురోజుకూ పెరుగుతున్నారు. బరువు తగ్గాలనుకునేవాళ్లు, ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టేవాళ్లు దీన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అయితే ఖాళీ కడుపుతో బ్లాక్‌ కాఫీ తాగే అలవాటు కొందరిలో ఆందోళన, గుండె దడ, చిరాకు వంటి సమస్యలను పెంచే అవకాశం ఉందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి.

ఎందుకు టెన్షన్‌?
రాత్రంతా ఏమీ తినకుండా ఉండటం వల్ల ఉదయం కడుపు ఖాళీగా ఉంటుంది. అలాంటి సమయంలో బ్లాక్‌ కాఫీ తాగితే అందులోని కెఫిన్‌ చాలా వేగంగా శరీరంలోకి చేరుతుంది. దీంతో మెదడు ఒక్కసారిగా అలర్ట్‌ అవుతుంది. కొందరిలో ఇది గుండె వేగంగా కొట్టుకోవడం, చేతులు స్వల్పంగా వణకడం, ఏదో తెలియని ఆందోళన కలగడం వంటి లక్షణాలకు కారణమవుతుంది.

అందరికీ ఒకేలా ప్రభావం ఉండదు
ఖాళీ కడుపుతో కాఫీ తాగినా కొంతమందికి ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ ఇప్పటికే ఆందోళన సమస్యలు ఉన్నవాళ్లు, ఒత్తిడి ఎక్కువగా ఎదుర్కొంటున్నవాళ్లు, కెఫిన్‌ సెన్సిటివిటీ ఉన్నవాళ్లలో ప్రభావం ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. కారణం లేకుండా టెన్షన్‌ రావడం, చిరాకు పెరగడం, దేనిపైనా దృష్టి నిలవకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడాల్సిందే.

నిపుణులు ఏం చెబుతున్నారు?
కాఫీని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే లేవగానే తాగడం కంటే అల్పాహారం చేసిన తర్వాత తాగడం మంచిదని వివరిస్తున్నారు. ఆకలి లేకపోయినా కనీసం పండు, బిస్కెట్‌ లేదా తేలికపాటి ఆహారం తీసుకున్న తర్వాత కాఫీ తాగితే కెఫిన్‌ ప్రభావం ఒక్కసారిగా పెరగకుండా ఉంటుంది. దీంతో ఆందోళన వంటి సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది.

కాఫీ మంచిదే.. కానీ..
బ్లాక్‌ కాఫీ వల్ల ఏకాగ్రత పెరగడం, అలసట తగ్గడం వంటి ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఏ ఆహారమైనా, పానీయమైనా మితంగా తీసుకున్నప్పుడే మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా ఖాళీ కడుపుతో తాగే అలవాటు వల్ల మీకు అసౌకర్యం కలుగుతోందని అనిపిస్తే సమయాన్ని మార్చుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Black Coffee
Empty Stomach Side Effects
Caffeine Anxiety
Weight Loss Tips
Health Risks Palpitations
Morning Coffee Habits

More Telugu News