విరాట్ కోహ్లీకి 'గర్వం'... రవిశాస్త్రి ఏమన్నారంటే?
- మైదానంలో కోహ్లీ అహంకారి, పొగరబోతన్నది నిజమేనన్న రవిశాస్త్రి
- కానీ ఫీల్డ్ బయట చాలా వినమ్రంగా, సౌమ్యంగా ఉంటాడని వెల్లడి
- కోహ్లీ గురించి ఉన్న అతిపెద్ద అపోహ ఇదేనంటూ వ్యాఖ్య
కోహ్లీకి చెందిన 'వన్8' లైఫ్‌స్టైల్ బ్రాండ్ నిర్వహించిన ఒక సంభాషణలో రవిశాస్త్రి ఈ విషయాలను వెల్లడించాడు . కోహ్లీ గురించి సమాజంలో ఉన్నఅభిప్రాయాలపై స్పందిస్తూ, "అహంకారి, పెంకితనం, నిరంతరం దూకుడుగా ఉండటం.. ఇవన్నీ అతడిలో కనిపిస్తాయి. అయితే, ఇవన్నీ కేవలం మైదానానికే పరిమితం" అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఆట ముగిసిన తర్వాత కోహ్లీ అత్యంత వినయశీలిగా, అందరితో ఎంతో ఆత్మీయంగా మెలిగే వ్యక్తిగా మారతాడని ఆయన వివరించాడు.
2017 నుంచి 2021 వరకు రవిశాస్త్రి ప్రధాన కోచ్‌గా, విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్న కాలంలో భారత క్రికెట్ జట్టు అద్భుత విజయాలను నమోదు చేసింది. ముఖ్యంగా ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్‌లను కైవసం చేసుకోవడం వంటి చారిత్రాత్మక విజయాలు వీరిద్దరి సమన్వయంతోనే సాధ్యమయ్యాయి. జట్టులో అజేయమైన దూకుడును, గెలవాలనే పట్టుదలను నూరిపోయడంలో ఈ ద్వయం కీలక పాత్ర పోషించింది.