ఏడాదిలో రూ.10 లక్షల నుంచి రూ.80 లక్షలకు.. యువతి చెప్పిన జాబ్‌ సీక్రెట్‌ వైరల్‌

Reetu Maurya shares job secret of increasing salary from 10 lakhs to 80 lakhs in one year
  • యువతి వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌
  • కంపెనీ అవసరాలు ముందుగా అధ్యయనం చేయాలని సూచన
  • ఏఐ సాయంతో ప్రాజెక్ట్‌ రూపొందించాలని సలహా
  • ప్రాజెక్ట్‌ను హైరింగ్‌ మేనేజర్‌కు పంపాలన్న రీతూ
  • లింక్డ్‌ఇన్‌లో ప్రాజెక్ట్‌ను ఉంచాలని సూచన
ఉద్యోగం కోసం వందలాది రెజ్యుమేలు పంపినా స్పందన రావడం లేదని చాలా మంది యువత ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. పోటీ పెరిగిపోవడంతో కేవలం డిగ్రీలు, సర్టిఫికెట్లు ఉంటే సరిపోవడం లేదని నిపుణులు చెబుతున్నారు. అలాంటి సమయంలో ఓ యువతి తన కెరీర్‌లో సాధించిన భారీ జీతం వెనక ఉన్న వ్యూహాన్ని సోషల్‌ మీడియాలో పంచుకుంది. ఏడాది వ్యవధిలోనే రూ.10 లక్షల వార్షిక వేతనం నుంచి రూ.80 లక్షల స్థాయికి చేరుకున్నానని ఆమె చెప్పడంతో ఆ వీడియో వైరల్‌గా మారింది.

రీతూ మౌర్య అనే యువతి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన వీడియోలో ఉద్యోగాల కోసం తాను అనుసరించిన విధానాన్ని వివరించింది. సాధారణంగా జాబ్‌కు అప్లై చేయడం కంటే ముందే తమ నైపుణ్యాలను కంపెనీకి చూపించడం చాలా కీలకమని ఆమె అభిప్రాయపడింది. ఆమె చెప్పిన ప్రకారం ముందుగా పనిచేయాలనుకుంటున్న కంపెనీని గుర్తించాలి. ఆ తర్వాత ఆ సంస్థకు సంబంధించిన జాబ్‌ డిస్క్రిప్షన్‌ను అధ్యయనం చేయాలి. ఆ ఉద్యోగానికి ప్రస్తుతం నియామకాలు జరుగుతున్నాయా? లేదా? అన్నది పెద్ద విషయం కాదని, కంపెనీకి ఎలాంటి నైపుణ్యాలు కావాలో తెలుసుకోవడమే కీలకమని పేర్కొంది.

ఆ తర్వాత చాట్‌జీపీటీ వంటి ఏఐ టూల్స్‌ సాయంతో ఆ ఉద్యోగానికి సంబంధించిన ఒక ప్రాజెక్ట్‌ ఐడియాను రూపొందించాలని సూచించింది. ఆ ప్రాజెక్ట్‌ను ఎలా తయారు చేయాలో కూడా ఏఐ సాయంతో తెలుసుకోవచ్చని తెలిపింది. అనంతరం ఏఐ ఆధారిత డెవలప్‌మెంట్‌ ప్లాట్‌ఫామ్‌ల సాయంతో ఆ ఆలోచనను పనిచేసే ప్రాజెక్ట్‌గా మార్చుకోవచ్చని వివరించింది.

అయితే మొదటి ప్రయత్నంలోనే ప్రాజెక్ట్‌ పూర్తయిందని భావించొద్దని రీతూ మౌర్య చెప్పింది. పలుమార్లు మార్పులు చేస్తూ, మెరుగులు దిద్దుతూ ఉపయోగపడే స్థాయికి తీసుకెళ్లాలని సూచించింది. ప్రాజెక్ట్‌ సిద్ధమైన తర్వాత దాన్ని నేరుగా హైరింగ్‌ మేనేజర్‌కు పంపాలని తెలిపింది.

తాము రూపొందించిన ప్రాజెక్ట్‌ కంపెనీ అవసరాలకు ఎలా ఉపయోగపడుతుందో వివరించే సందేశాన్ని జత చేయాలని సూచించింది. అంతేకాకుండా ప్రాజెక్ట్‌కు సంబంధించిన చిన్న వీడియోను లింక్డిన్‌లో పోస్టు చేసి ప్రొఫైల్‌లో పిన్‌ చేయడం వల్ల మరింత గుర్తింపు లభిస్తుందని పేర్కొంది.

కేవలం రెజ్యుమేతో కాకుండా తమ సామర్థ్యాన్ని ముందుగానే చూపించడం వల్ల ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉందని రీతూ మౌర్య అభిప్రాయపడింది. ప్రస్తుతం ఏఐ టూల్స్‌ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఈ విధానం ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న యువతలో ఆసక్తి రేకెత్తిస్తోంది.
Go Back to Shorts
Reetu Maurya
Salary Hike Strategy
AI Job Search Tips
Career Growth Secrets
LinkedIn Job Hacks
High Paying Jobs

More Telugu News