ఆర్చరీలో డబుల్ గోల్డ్: ధీరజ్‌పై ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసలు
- ఆర్చరీ వరల్డ్ కప్‌లో రెండు స్వర్ణాలు సాధించిన ధీరజ్ బొమ్మదేవర
- విజయవాడ ఆర్చర్ ధీరజ్‌ను అభినందించిన సీఎం చంద్రబాబు
- మిక్స్‌డ్ టీమ్, వ్యక్తిగత రికర్వ్ విభాగాల్లో స్వర్ణ పతకాల కైవసం
- భారత ఆర్చరీకి ఐదేళ్ల తర్వాత వ్యక్తిగత విభాగంలో స్వర్ణం
- ధీరజ్ విజయం యువతకు స్ఫూర్తిదాయకమని కొనియాడిన ముఖ్యమంత్రి
ఈ టోర్నీలో ధీరజ్ అసాధారణ ప్రదర్శన కనబరిచారు. మిక్స్‌డ్ టీమ్ విభాగంలో కుంకుమ్ అనిల్ మోహోద్‌తో కలిసి దక్షిణ కొరియా అగ్రశ్రేణి జోడీని ఓడించి స్వర్ణం కైవసం చేసుకున్నారు. అనంతరం అదే రోజు జరిగిన పురుషుల వ్యక్తిగత రికర్వ్ ఫైనల్‌లో ఒలింపిక్ పతక విజేత లీ వూ-సియోక్‌పై 7-3 తేడాతో ఘనవిజయం సాధించి, తన కెరీర్‌లో తొలి వ్యక్తిగత వరల్డ్ కప్ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నారు.
ఈ ఘనతపై ముఖ్యమంత్రి చంద్రబాబు సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించారు. "బలమైన ప్రత్యర్థులపై అద్భుత ప్రదర్శన కనబర్చి ధీరజ్ సాధించిన ఈ విజయం రాష్ట్రానికే కాకుండా యావత్ దేశానికి గర్వకారణం. ఈ ఘనత ఎందరో యువ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుంది" అని పేర్కొన్నారు. ధీరజ్‌తో పాటు కుంకుమ్ మోహోద్‌ను, భారత బృందాన్ని కూడా ఆయన అభినందించారు.
భారత ఆర్చరీ రంగానికి ఈ విజయం ఒక మైలురాయిగా నిలిచింది. దాదాపు ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత, ఒక భారతీయ పురుష ఆర్చర్ వరల్డ్ కప్‌లో వ్యక్తిగత స్వర్ణ పతకం సాధించడం విశేషం.