కొత్త మలుపు తీసుకున్న టీఎంసీ తిరుగుబాటు వ్యవహారం!
- టీఎంసీకి షాక్ ఇచ్చిన 20 మంది లోక్సభ ఎంపీలు
- నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీలో తమ వర్గం విలీనం
- బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు మద్దతు ప్రకటన
- స్పీకర్ ఓం బిర్లాను కలిసి లేఖ అందజేసిన నేతలు
సీనియర్ నాయకులు కాకోలి ఘోష్ దస్తిదార్, సుదీప్ బంద్యోపాధ్యాయ నేతృత్వంలోని ఈ అసమ్మతి వర్గం నిన్న లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసింది. ఎన్సీపీఐలో తమ విలీనాన్ని గుర్తించాలని కోరుతూ ఆయనకు అధికారిక లేఖను సమర్పించారు. అదేవిధంగా, లోక్సభలో తమకు ప్రత్యేకంగా సీట్లు కేటాయించాలని వారు స్పీకర్ను కలిసి విజ్ఞప్తి చేశారు.
"మేము నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీలో విలీనమవుతున్నాం. ఇకపై ప్రధానమంత్రి నాయకత్వంలోని ఎన్డీఏతో కలిసి దేశాభివృద్ధి కోసం పనిచేస్తాం" అని సమావేశం అనంతరం కాకోలి ఘోష్ దస్తిదార్ మీడియాకు వెల్లడించారు. లోక్సభలో టీఎంసీకి ఉన్న మొత్తం బలంలో తమది మూడింట రెండొంతుల కంటే ఎక్కువ ప్రాతినిధ్యమని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు.
ఈ పరిణామాలపై టీఎంసీ అధిష్టానం తీవ్రంగా స్పందించింది. నిబంధనల మేరకు ఈ తిరుగుబాటు వర్గాన్ని గుర్తించవద్దని ఆ పార్టీ అగ్రనేత అభిషేక్ బెనర్జీ స్పీకర్ను కోరినట్లు సమాచారం.