దుబాయ్‌లో మెదక్ వాసి గుండెపోటుతో మృతి
- ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన మెదక్ జిల్లా వాసి సాయికిరణ్ మృతి
- గతేడాది మే నెలలో ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లిన బాధితుడు
- మృతదేహాన్ని స్వదేశానికి రప్పించాలని ప్రభుత్వానికి కుటుంబం వినతి
కుటుంబ సభ్యులు అందించిన వివరాల ప్రకారం సాయికిరణ్‌కు నాగలక్ష్మితో వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ పోషణ కోసం గతేడాది మే నెలలో ఆయన దుబాయ్‌కు వెళ్లాడు. అక్కడ పనిచేస్తుండగా, ఈ నెల 2వ తేదీన తీవ్రమైన గుండెపోటు రావడంతో మరణించాడు. ఈ విషయం ఆలస్యంగా కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
సాయికిరణ్ మరణ వార్తతో వడియారం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోయామని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సాయికిరణ్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వగ్రామానికి తెప్పించాలని కోరుతూ ఆయన కుటుంబ సభ్యులు 'సీఎం ప్రవాసీ ప్రజావాణి'ని ఆశ్రయించారు. తమకు సహకరించి, మృతదేహాన్ని భారత్‌కు తరలించే ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.