ఏపీ రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం.. కూటమి ఖాతాలోకి మరో నలుగురు ఎంపీలు
- ప్రత్యర్థి పార్టీల నుంచి రాని నామినేషన్లు
- టీడీపీ తరపున విజయ్, భాష్యం రామకృష్ణ, సానా సతీశ్ గెలుపు
- జనసేన నుంచి లింగమనేని రమేశ్ జయకేతనం
ఆంధ్రప్రదేశ్ కోటాలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాల ఎన్నిక ప్రక్రియ ఏకగ్రీవం అయింది. కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ నుంచి ముగ్గురు, జనసేన పార్టీ నుంచి ఒకరిని ఆయా పార్టీల అధిష్ఠానాలు బరిలోకి దించాయి.
టీడీపీ అభ్యర్థులుగా చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ, సానా సతీశ్ నామినేషన్లు దాఖలు చేయగా, జనసేన తరఫున లింగమనేని రమేశ్ నామినేషన్ వేశారు. ప్రత్యర్థి పార్టీల నుంచి ఎలాంటి నామినేషన్లు రాకపోగా, ఉపసంహరణ గడువు కూడా ఇవాళ్టితో ముగియడంతో ఈ నలుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ధృవీకరించారు.