రక్తదానం చేస్తే ఆరోగ్యానికి మేలా? వైద్యులు ఏమంటున్నారంటే..!
- రక్తదానం అదనపు ఐరన్‌ను తగ్గిస్తుంది
- గుండె ఆరోగ్యానికి మేలు జరగొచ్చు
- కాలేయంపై ఒత్తిడి తగ్గే అవకాశం
- ఉచిత ఆరోగ్య పరీక్షకు అవకాశం
- కొత్త రక్తకణాల ఉత్పత్తి వేగవంతం
ఐరన్ స్థాయులు నియంత్రణలో
శరీరానికి ఐరన్ చాలా అవసరం. ఇది హిమోగ్లోబిన్ తయారీలో కీలక పాత్ర పోషిస్తుంది. కానీ అవసరానికి మించి పేరుకుపోతే అవయవాలకు నష్టం కలిగే ప్రమాదం ఉంటుంది. రక్తదానం చేయడం వల్ల అదనపు ఐరన్ కొంత మేర బయటకు వెళ్లిపోతుంది. దీంతో శరీరంలో ఐరన్ బ్యాలెన్స్ కాపాడటానికి సహాయపడుతుంది.
గుండె ఆరోగ్యానికి దోహదం
రక్తదానం గుండె ఆరోగ్యంపై కూడా సానుకూల ప్రభావం చూపొచ్చని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. రక్తంలో ఐరన్ తగ్గడం వల్ల రక్తనాళాలపై ఆక్సిడేటివ్ ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే రక్తం కొద్దిగా పలుచబడటంతో రక్తప్రసరణ సులభమవుతుంది. అయితే గుండె జబ్బులను పూర్తిగా నివారిస్తుందని చెప్పడానికి ఇంకా తగిన ఆధారాలు లేవని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
కాలేయానికి ఉపశమనం
శరీరంలో అదనపు ఐరన్ ఎక్కువగా కాలేయంలోనే నిల్వ ఉంటుంది. ఇది దీర్ఘకాలంలో కాలేయంపై ఒత్తిడి పెంచవచ్చు. రక్తదానం ద్వారా ఐరన్ లెవెల్స్ నియంత్రణలో ఉంటే కాలేయ ఆరోగ్యానికి మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఫ్యాటీ లివర్ వంటి సమస్యల ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఉచిత ఆరోగ్య పరీక్ష లాంటిదే
రక్తదానం చేసే ముందు కొన్ని ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. హిమోగ్లోబిన్, రక్తపోటు, శరీర ఉష్ణోగ్రత, పల్స్‌రేట్‌ను పరిశీలిస్తారు. కొన్ని సందర్భాల్లో తెలియని ఆరోగ్య సమస్యలు కూడా ఈ పరీక్షల్లో బయటపడొచ్చు. అలాగే సేకరించిన రక్తాన్ని కొన్ని అంటువ్యాధుల కోసం పరీక్షిస్తారు. దీంతో ముందుగానే ఆరోగ్య సమస్యలను గుర్తించే అవకాశం ఉంటుంది.
కొత్త రక్తకణాల ఉత్పత్తి
రక్తదానం చేసిన తర్వాత శరీరం కోల్పోయిన రక్తాన్ని భర్తీ చేసే పనిని వెంటనే ప్రారంభిస్తుంది. ఎముక మజ్జ కొత్త రక్తకణాల తయారీని వేగవంతం చేస్తుంది. కొన్ని రోజుల్లో ప్లాస్మా తిరిగి సాధారణ స్థాయికి చేరుతుంది. ఎర్ర రక్తకణాలు కూడా క్రమంగా పూర్వ స్థితికి చేరుకుంటాయి. ఇది శరీరంలో సహజంగా జరిగే ప్రక్రియ.
మానసిక సంతృప్తి కూడా
రక్తదానం వల్ల మానసికంగా కూడా మంచి అనుభూతి కలుగుతుంది. ఒకరి ప్రాణాన్ని కాపాడేందుకు తాము తోడ్పడ్డామనే భావన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఒత్తిడి తగ్గడంలో, సానుకూల భావనలు పెరగడంలో కూడా ఇది సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
జాగ్రత్తలు తప్పనిసరి
అయితే తరచూ రక్తదానం చేయడం వల్ల ఐరన్ లోపం వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. అలసట, బలహీనత, తల తిరగడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. కొందరికి తాత్కాలికంగా మూర్ఛ, నీరసం, సూది వేసిన చోట నొప్పి వంటి ఇబ్బందులు రావొచ్చు. అందుకే వైద్యుల సూచనలు పాటిస్తూ నిర్ణీత వ్యవధి తర్వాతే రక్తదానం చేయాలి.