అత్యధిక వేడి ముప్పున్న ప్రపంచ టాప్-30 నగరాల్లో హైదరాబాద్!
- ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడి
- వేగంగా పెరిగిన నగరీకరణ, పచ్చదనం తగ్గడమే ప్రధాన కారణాలు
- ఈ వేసవిలో రికార్డు స్థాయిలో 47 రోజులు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు
- భారత్ నుంచి 14 నగరాలకు అధిక ఉష్ణ ముప్పు ఉందన్న నివేదిక
'మూవింగ్ బియాండ్ ఎక్స్పోజర్' పేరిట ప్రపంచవ్యాప్తంగా 205 ప్రధాన నగరాలపై ఈ పరిశోధన నిర్వహించారు. కేవలం గరిష్ఠ ఉష్ణోగ్రతలు కాకుండా, నగరాల్లోని కూలింగ్ సదుపాయాలు, పచ్చదనం, సామాజిక-ఆర్థిక పరిస్థితులు వంటి వివిధ అంశాలను ప్రాతిపదికగా తీసుకుని ఈ నివేదికను రూపొందించారు. ఒక కోటికి పైగా జనాభా కలిగిన హైదరాబాద్ నగరానికి 'హీట్ వల్నరబిలిటీ ఇండెక్స్'లో 0.68 స్కోర్ లభించింది. ఈ జాబితాలో కైరో, మనీలా వంటి అంతర్జాతీయ నగరాల సరసన హైదరాబాద్ నిలిచింది.
భారత్‌లోని అహ్మదాబాద్, నాగ్‌పూర్, మదురై నగరాల్లో హైదరాబాద్ కంటే ఎక్కువ ముప్పు ఉన్నట్టు ఈ నివేదిక స్పష్టం చేసింది. కాగా ముంబై, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ వంటి నగరాల పరిస్థితి కాస్త మెరుగ్గా ఉన్నట్లు వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఉష్ణ ముప్పును ఎదుర్కొంటున్న టాప్-50 నగరాల్లో 14 భారత్‌కు చెందినవే కావడం గమనార్హం.
ఈ ఏడాది వేసవిలో హైదరాబాద్ నగరం గత దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంతటి తీవ్రమైన ఎండలను చవిచూసింది. ఏప్రిల్ 1 నుంచి జూన్ 5 మధ్యకాలంలో సుమారు 47 రోజులు పాటు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ను దాటాయి. నగరం వేగంగా విస్తరించడం, పచ్చదనం క్షీణించడం, తగ్గిన కూలింగ్ సదుపాయాలు అందరికీ అందుబాటులో లేకపోవడం వంటి కారణాలు ఈ ముప్పును మరింత తీవ్రం చేస్తున్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో నగరాలు తక్షణమే స్పందించి పచ్చదనాన్ని పెంచాలని, అందరికీ అందుబాటులో ఉండేలా కూలింగ్ సదుపాయాలను మెరుగుపరచాలని ఈ అధ్యయనం సూచిస్తోంది.