నా వివాహేతర సంబంధాలను అడ్డం పెట్టుకొని.. ఎప్‌స్టీన్‌పై బిల్‌గేట్స్‌ సంచలన ఆరోపణలు

  • వ్యక్తిగత సమాచారంతో ఒత్తిడికి యత్నించాడన్న బిల్‌ గేట్స్‌
  • కుటుంబానికి తీవ్ర బాధ కలిగిందని ఆవేదన ‌
  • ఎప్‌స్టీన్‌తో పరిచయం తప్పిదమని వ్యాఖ్య
  • 2011 నుంచి 2014 వరకు ఎప్‌స్టీన్‌తో సమావేశాలు
తన వివాహేతర సంబంధాలకు సంబంధించిన సమాచారాన్ని అడ్డం పెట్టుకొని తనపై ఒత్తిడి తెచ్చేందుకు జెఫ్రీ ఎప్‌స్టీన్‌ యత్నించాడని బిల్‌ గేట్స్‌ వెల్లడించారు. అమెరికా ప్రతినిధుల సభ కమిటీ ముందు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఆయన ఈ విషయాన్ని పేర్కొన్నారు. ఎప్‌స్టీన్‌తో తనకు ఉన్న పరిచయాలపై కమిటీ ప్రశ్నలు అడిగిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎప్‌స్టీన్‌తో జరిగిన సమావేశాలకు తన ఎఫైర్స్‌తో ఎలాంటి సంబంధం లేదని గేట్స్‌ చెప్పారు. అయితే ఆ వ్యవహారం తన కుటుంబానికి తీవ్ర బాధ కలిగించిందని పేర్కొన్నారు. తన అక్రమ సంబంధాలపై సమాచారం సేకరించి, తనతో పరిచయం కొనసాగించేలా ఒత్తిడి తీసుకురావాలని ఎప్‌స్టీన్‌ యత్నించాడని ఆరోపించారు.

ఎప్‌స్టీన్‌తో పరిచయం తన జీవితంలో పెద్ద తప్పిదమని గేట్స్‌ మరోసారి స్పష్టం చేశారు. అయితే ఎప్‌స్టీన్‌ నేర కార్యకలాపాలకు పాల్పడటం తాను ఎప్పుడూ ప్రత్యక్షంగా చూడలేదని చెప్పారు. తనవైపు నుంచి ఎలాంటి తప్పు జరగలేదని పేర్కొన్నారు. తన సేవా కార్యక్రమాలకు ఎప్‌స్టీన్‌తో పరిచయం ముప్పుగా మారిందని తెలిపారు.

గేట్స్‌, ఎప్‌స్టీన్‌ల మధ్య పరిచయం 2011లో ప్రారంభమైంది. అప్పటికే ఎప్‌స్టీన్‌ ఫ్లోరిడాలో మైనర్‌తో వ్యభిచారానికి ప్రేరేపించిన కేసులో దోషిగా తేలాడు. అయితే అప్పట్లో ఆరోపణల తీవ్రత తనకు పూర్తిగా తెలియదని గేట్స్‌ చెప్పారు. సరైన స్థాయిలో పరిశీలించకుండా ఆ పరిచయాన్ని అంగీకరించానని అన్నారు. 2011 నుంచి 2014 మధ్య పలుసార్లు ఇద్దరూ కలుసుకున్నట్లు తెలిపారు. ప్రధానంగా విరాళాల అంశంపైనే చర్చలు జరిగాయని చెప్పారు. అయితే ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదని, 2014 చివరి నాటికే సంబంధాలు దాదాపు ముగిశాయని వివరించారు. 2019లో ఎప్‌స్టీన్‌ సెక్స్‌ ట్రాఫికింగ్‌ కేసులో అరెస్టైన తర్వాత గేట్స్‌తో అతని సంబంధాల విషయం వెలుగులోకి వచ్చింది.

Bill Gates
Jeffrey Epstein
Extramarital affairs
Blackmail allegations
US House Committee
Philanthropy

More Telugu News