ద్రోణి ప్రభావం: నేడు ఏపీలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు
- రాయలసీమ, మార్కాపురం ప్రాంతాల్లో మోస్తరు వర్షాల అంచనా
- విశాఖలో ఈదురుగాలులకు నష్టం.. విరిగిన చెట్లు, కరెంట్ స్తంభాలు
- అప్రమత్తంగా ఉండాలన్న విపత్తుల సంస్థ
ఈ మేరకు ఏపీఎస్డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వివరాలు వెల్లడించారు. మార్కాపురం, రాయలసీమ జిల్లాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వివరించారు.
కాగా, బుధవారం సాయంత్రం శ్రీకాకుళం జిల్లా గరికిపాలెంలో 72.5 మిల్లీమీటర్లు, లావేరులో 64.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు, అనకాపల్లి జిల్లా మకవరపాలెం, తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో గరిష్ఠంగా 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయ్యింది.
విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలంలో బుధవారం సాయంత్రం వీచిన ఈదురుగాలుల వల్ల పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. దీంతో అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో, వర్ష సూచన ఉన్న ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పిడుగులు, బలమైన గాలుల పట్ల తగిన జాగ్రత్తలు వహించాలని అధికారులు సూచించారు.