పోలీసుల నుంచి తప్పించుకోబోయి చెరువులోకి దూకాడు.. మొసలి నోటికి చిక్కాడు!

  • అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో ఘటన
  • మద్యం తాగి డ్రైవింగ్‌ చేసిన నిందితుడు
  • సమాచారం అందగానే వెంబడించిన పోలీసులు
  • తప్పించుకోబోయి చెరువులోకి దూకిన నిందితుడు
  • మొసలి దాడి చేయడంతో గాయాలు
  • చివరకు పోలీసులకు చిక్కిన నిందితుడు
పోలీసుల నుంచి తప్పించుకోవాలని చేసిన ప్రయత్నం ఓ వ్యక్తికి ఊహించని షాక్‌ ఇచ్చింది. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు చెరువులోకి దూకిన అతడిపై ఓ మొసలి దాడి చేసింది. అమెరికాలో జరిగిన ఈ విచిత్ర ఘటన ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో విక్టర్‌ రివాస్‌ అనే 40 ఏళ్ల వ్యక్తి మద్యం మత్తులో కారు నడుపుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అతడు నడుపుతున్న టయోటా కారు రోడ్డుపక్కన ఉన్న కాంక్రీట్‌ డివైడర్‌ను ఢీకొట్టడంతో పాటు టైరు కూడా పేలిపోయింది. అనంతరం పోలీసులు ఆ వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించారు. అయితే రివాస్‌ కారును వదిలేసి కాలినడకన పారిపోయాడు. సమీపంలోని చెరువులోకి దూకి పోలీసులకు కనిపించకుండా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కొంతసేపటి తర్వాత పోలీసులు అతడిని గుర్తించినా మళ్లీ చిత్తడి ప్రాంతంలోకి పరిగెత్తాడు.

అప్పుడే ఊహించని ఘటన జరిగింది. నీటిలో ఉన్న ఓ మొసలి వేగంగా అతడి వైపు దూసుకొచ్చి దాడి చేసింది. దీంతో రివాస్‌ రెండు చేతులకు గాయాలయ్యాయి. అయినప్పటికీ అతడు అక్కడి నుంచి మళ్లీ పారిపోయేందుకు యత్నించాడు. చివరకు డ్రోన్‌ సాయంతో అతడి కదలికలను గుర్తించిన పోలీసులు అరెస్టు చేశారు. గాయాల కారణంగా ముందుగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మద్యం మత్తులో వాహనం నడపడం, పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించడం తదితర కేసులు నమోదు చేశారు.

ఈ ఘటన తర్వాత సోషల్‌ మీడియాలో సరదా వ్యాఖ్యలు వెల్లువెత్తాయి. స్థానిక పోలీసు స్టేషన్‌ కూడా మొసలిని ‘డిప్యూటీ ఆఫ్‌ ది ఇయర్‌’గా చూపిస్తూ రూపొందించిన ఏఐ చిత్రాన్ని పంచుకుంది. ‘‘మద్యం తాగి డ్రైవింగ్‌ చేయొద్దు.. పోలీసుల నుంచి పారిపోవొద్దు.. ముఖ్యంగా లూసియానా చెరువుల్లో దాక్కోవద్దు’’ అంటూ సరదాగా వ్యాఖ్యానించింది.

Victor Rivas
Louisiana alligator attack
DUI suspect escape
Louisiana police chase
Alligator deputy of the year
Louisiana swamp arrest

More Telugu News