ఉద్యోగుల ఈమెయిల్స్‌పై ఏఐ నిఘా.. కాగ్నిజెంట్‌కు రూ.1,700 కోట్ల బిజినెస్‌!

Cognizant generates 1700 crore business through AI monitoring of employee emails
  • ఏఐతో ఈమెయిల్స్‌తో డేటా విశ్లేషణ
  • 200 మిలియన్‌ డాలర్ల బిజినెస్‌ అవకాశం
  • ఈమెయిల్స్‌, చాట్స్‌ పరిశీలన
  • కస్టమర్‌ అవసరాల గుర్తింపు
  • ప్రాజెక్ట్‌ రిస్క్‌ల అంచనా
  • ఆగస్టులో ఉద్యోగులకు వేతన పెంపులు
ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్‌ ఉద్యోగుల ఈమెయిల్స్‌, సమావేశాలు, చాట్స్‌ వంటి ఆఫీస్‌ ఇన్ఫర్మేషన్‌ను ఏఐతో విశ్లేషించి భారీ స్థాయిలో కొత్త వ్యాపార అవకాశాలను గుర్తిస్తున్నట్లు వెల్లడించింది. ఈ విధానంతో ఇప్పటికే సుమారు రూ.1,700 కోట్ల అదనపు బిజినెస్‌ అవకాశాలు లభించాయని తెలిపింది.

సంస్థలో రోజూ జరిగే సంభాషణలు, సమావేశాలు, కస్టమర్లతో జరిగే చర్చల నుంచి ఉపయోగకరమైన సమాచారాన్ని ఏఐ ద్వారా వెలికితీస్తున్నామని కాగ్నిజెంట్‌ సీఈఓ రవి కుమార్‌ చెప్పారు. దీని ఆధారంగా కస్టమర్ల అవసరాలను ముందుగానే గుర్తించి కొత్త ప్రాజెక్టులు, సేవలను ప్రతిపాదిస్తున్నామని వివరించారు.

ఉదాహరణకు ఓ కస్టమర్‌ తన ఇంజినీరింగ్‌ ఖర్చులను తగ్గించుకోవాలనుకుంటున్న విషయాన్ని ఏఐ గుర్తించింది. ఆ తర్వాత నాణ్యతా పరీక్షల ప్రక్రియను మెరుగుపరిచే ప్రతిపాదనను సూచించింది. దీని వల్ల కస్టమర్‌కు ప్రయోజనం కలగడంతో పాటు కంపెనీకి కొత్త వ్యాపార అవకాశం కూడా దక్కిందని కాగ్నిజెంట్‌ తెలిపింది.

అంతేకాదు ప్రాజెక్టుల్లో తలెత్తే సమస్యలను ముందుగానే గుర్తించడం, సరైన ఉద్యోగులను సరైన ప్రాజెక్టులకు ఎంపిక చేయడం వంటి పనుల్లో కూడా ఈ సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు వెల్లడించింది. ఉద్యోగుల జీతాల పెంపుపై కూడా కాగ్నిజెంట్‌ తాజాగా స్పష్టత ఇచ్చింది. అర్హులైన ఉద్యోగులకు మెరిట్‌ ఆధారిత వేతన పెంపులు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయని రవి తెలిపారు.

జీతాల పెంపు వాయిదా పడిందన్న వార్తలను సంస్థ ఖండించింది. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఆగస్టులోనే పెంపులు అమలు చేస్తామని స్పష్టం చేసింది. బోనస్‌లు కూడా యథావిధిగా అందజేస్తామని పేర్కొంది.
Go Back to Shorts
Cognizant
Ravi Kumar
AI email monitoring
Cognizant salary hike 2024
IT industry business growth
Artificial Intelligence in workplace

More Telugu News