ప్రైవేట్ కేసును అడ్డం పెట్టుకొని కుట్ర: మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై ఎంపీ చామల

  • మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించిన ఎన్నికల అధికారులు
  • కుట్రపూరితంగా నామినేషన్ రిజెక్ట్ చేశారన్న చామల
  • కాంగ్రెస్‌ను రేసు నుంచి తప్పించేందుకు ముందు నుంచే బీజేపీ స్కెచ్ వేసిందని విమర్శ

మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించడంపై రాజకీయ రగడ ముదురుతోంది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒక చిన్న ప్రైవేట్ కేసును అడ్డం పెట్టుకొని, కావాలనే కుట్రపూరితంగా మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను రిజెక్ట్ చేశారని ఆయన విమర్శించారు.


బీఎన్‌ఎస్ (BNS) యాక్ట్ 230 ప్రకారం ఫామ్ 26 సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదని... చట్టాలను తుంగలో తొక్కి బీజేపీ ఈ చర్యలకు పాల్పడుతోందని ఎంపీ స్పష్టం చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐలతో పాటు ఎన్నికల సంఘాన్ని కూడా అడ్డం పెట్టుకొని... బీజేపీ ఈ ఎన్నికలను తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తోందని చామల ఆరోపించారు. "మధ్యప్రదేశ్‌లో బలబలాల ప్రకారం బీజేపీకి రెండు రాజ్యసభ సీట్లు, కాంగ్రెస్‌కు ఒక సీటు వచ్చే అవకాశం ఉంది. అలాంటప్పుడు మూడో అభ్యర్థిని బీజేపీ ఎందుకు పోటీలో నిలబెట్టింది?" అని ఆయన ప్రశ్నించారు. దీన్ని బట్టే కాంగ్రెస్‌ను ఎలాగైనా రేసు నుంచి తప్పించాలని బీజేపీ ముందు నుంచే స్కెచ్ వేసిందని అర్థమవుతోందన్నారు.


ఇదే తరుణంలో తెలంగాణ ప్రాంతీయ రాజకీయాలను ప్రస్తావిస్తూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలని బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు కలిసి కుట్రలు పన్నుతున్నాయని, ఆ రెండు పార్టీలు ఒక్కటేనని విమర్శించారు. మధ్యప్రదేశ్‌లో ఎన్నికల సంఘం ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఇక్కడి బీఆర్‌ఎస్ పార్టీ సమర్థిస్తుందా అని చామల నిలదీశారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తే ప్రజలు బుద్ధి చెబుతారని, ఎప్పటికీ అధికారంలోకి రాలేరని ఆయన హెచ్చరించారు.


Meenakshi Natarajan
Chamala Kiran Kumar Reddy
Rajya Sabha Elections
Madhya Pradesh
Congress Party
BJP

More Telugu News