ఆ చిట్టీ ఇచ్చింది మీ వాళ్లే: మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై బీజేపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

  • మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు షాక్
  • మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
  • ఆమెపై కేసులు ఉన్నాయనే విషయాన్ని టీకాంగ్రెస్ నేతలే లీక్ చేశారన్న విజయ్‌వర్గీయ  

మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నేత, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన నామినేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. ఈ నిర్ణయానికి నిరసనగా కాంగ్రెస్ అగ్రనేతలు ఢిల్లీలోని ఈసీ కార్యాలయం ముందు బైఠాయించగా... తమకు జరిగిన అన్యాయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.


అయితే, ఈ హైడ్రామా నడుస్తున్న తరుణంలో మధ్యప్రదేశ్ బీజేపీ కీలక మంత్రి కైలాష్ విజయ్‌వర్గీయ ఒక పొలిటికల్ బాంబు పేల్చారు. మీడియాతో మాట్లాడిన మంత్రి కైలాష్ విజయ్‌వర్గీయ.. "అసలు మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణలో కేసులు ఉన్నాయనే విషయం మాకు ముందే తెలియదు. మాకు ఆ సమాచారం ఇచ్చింది, అక్కడి నుండి చిట్టీ పంపింది స్వయంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలే" అని కుండబద్దలు కొట్టారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తు చేసిన ఆయన.. సొంత పార్టీ నేతలే ఆమెపై ఉన్న కేసుల వివరాలను లీక్ చేశారంటే, ఆ పార్టీ అంతర్గత వ్యవహారాలు ఎంత ఘోరంగా ఉన్నాయో ప్రజలకే అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం రేపుతున్నాయి.


Meenakshi Natarajan
Kailash Vijayvargiya
Rajya Sabha Elections
Madhya Pradesh News
Telangana Congress
Nomination Rejection

More Telugu News