విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రమాదం.. 24 గంటల్లోనే చెప్పిన మాట నిలబెట్టుకున్న మంత్రి లోకేశ్‌

  • మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున చెక్కులు అందించిన మంత్రి 
  • ఒక్కో కుటుంబానికి రూ. 1.72 కోట్ల వరకు ప్రయోజనాలు, ఉద్యోగం ఇస్తామన్న పవన్ 
  • ప్రమాద కారణాలపై కేంద్ర ఉక్కుశాఖ త్రిసభ్య కమిటీ విచారణ ప్రారంభం
  • రూ. 120 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా
విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపుతూనే ఉంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 9కి చేరింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పైడిరాజు అనే మరో ఉద్యోగి ఇవాళ‌ ఉదయం ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ధ్రువీకరించారు. దీంతో ప్లాంట్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మరోవైపు ప్రభుత్వం ప్రకటించిన సహాయక చర్యలు వేగంగా అమలవుతున్నాయి. మంగళవారం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ బాధిత కుటుంబాలను పరామర్శించి, ఇచ్చిన మాట ప్రకారం 24 గంటలు గడవకముందే మంత్రి లోకేశ్‌ చర్యలు చేపట్టారు. మృతుల కుటుంబాలకు తక్షణ పరిహారం కింద రూ. 25 లక్షల చొప్పున చెక్కులను స్వయంగా అందించారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షలు, క్షతగాత్రులకు రూ. 10 లక్షలు అందిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు. దీనికి అదనంగా రెగ్యులర్ ఉద్యోగి కుటుంబానికి అన్ని ప్రయోజనాలు కలిపి రూ. 1.72 కోట్లు, ఒప్పంద ఉద్యోగి కుటుంబానికి రూ. 45 లక్షలు అందుతాయని వివరించారు. మృతుడు శాశ్వత ఉద్యోగి అయినా, ఒప్పంద ఉద్యోగి అయినా వారి కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పిస్తామని, వారి పిల్లల చదువుల బాధ్యతను కూడా ప్రభుత్వమే తీసుకుంటుందని హామీ ఇచ్చారు.

ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపేందుకు కేంద్ర ఉక్కుశాఖ ఇప్పటికే త్రిసభ్య కమిటీని నియమించింది. బొకారో సెయిల్ డైరెక్టర్ ప్రియరంజన్ నేతృత్వంలోని ఈ కమిటీ ప్రమాద స్థలాన్ని పరిశీలించింది. మరో రెండు రోజుల పాటు విశాఖలోనే ఉండి ప్రమాదానికి గల కారణాలను శోధించనుంది. ఈ దుర్ఘటన కారణంగా స్టీల్‌ప్లాంట్‌కు భారీ ఆర్థిక నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. రెండు రోజుల పాటు ఉత్పత్తి నిలిచిపోవడంతో సుమారు రూ. 100 కోట్లు, యంత్ర పరికరాలు దెబ్బతినడం వల్ల మరో రూ. 20 కోట్లు, మొత్తంగా రూ. 120 కోట్లకు పైగా నష్టం జరిగిందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఎస్‌ఎంఎస్‌-1లోని ఒక మిషన్ ఆగిపోగా, మిగిలిన ఐదు మిషన్లతో ఉత్పత్తిని పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Nara Lokesh
Visakhapatnam Steel Plant
Vizag Steel Plant accident
Pawan Kalyan
Steel Plant compensation
Andhra Pradesh government

More Telugu News