తూర్పు గోదావరి ట్రిపుల్ మర్డర్ కేసు: జీవిత ఖైదీకి క్షమాభిక్ష నిరాకరించిన సుప్రీంకోర్టు
- తూర్పు గోదావరి జిల్లా ట్రిపుల్ మర్డర్ కేసులో దోషికి సుప్రీంకోర్టులో నిరాశ
- జీవిత ఖైదు నుంచి విడుదల చేయాలన్న పిటిషన్‌ను కొట్టివేసిన ధర్మాసనం
- గతంలోనూ ఓ హత్య కేసులో శిక్ష అనుభవించినట్లు గుర్తించిన కోర్టు
- బైపోలార్ డిజార్డర్ వాదనను పరిగణనలోకి తీసుకోని సర్వోన్నత న్యాయస్థానం
కేసు వివరాల ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ గ్రామానికి చెందిన ఆనందకుమార్ గతంలో తన సోదరుడితో కలిసి ఓ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవించాడు. జైలు శిక్షా కాలంలో తల్లి మరణించడంతో అతను విడుదలయ్యాడు. అయితే, తన నేర చరిత్రను ప్రస్తావిస్తూ ఇరుగుపొరుగు వారు హేళన చేస్తున్నారనే కక్షతో 2015 డిసెంబర్ 24న ఇనుప పైపుతో దాడి చేసి ఏడిద విజయలలిత, గెడ్డం నాగభూషణం, ఖండవల్లి కుమారి అనే ముగ్గురిని దారుణంగా హత్య చేశాడు. ఈ కేసులో రాజమండ్రి ట్రయల్ కోర్టు అతనికి జీవిత ఖైదు విధించగా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సైతం ఆ తీర్పును సమర్థించింది.
హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఆనందకుమార్ ఈ ఏడాది మే 25న సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తాను బైపోలార్ డిజార్డర్‌తో బాధపడుతున్నానని, తన మానసిక పరిస్థితి దృష్ట్యా శిక్ష నుంచి ఉపశమనం కల్పించాలని అభ్యర్థించాడు. అయితే ఈ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. "ఒక హత్య కేసులో శిక్ష అనుభవించి వచ్చిన తర్వాత, మళ్లీ ముగ్గురిని దారుణంగా చంపిన వ్యక్తికి ఉపశమనం ఎలా కల్పిస్తాం?" అని న్యాయస్థానం ప్రశ్నించింది. నిందితుడికి నేర చరిత్ర ఉన్నందున క్షమాభిక్షకు అర్హుడు కాదని స్పష్టం చేస్తూ, ట్రయల్ కోర్టు విధించిన జీవిత ఖైదును సుప్రీంకోర్టు ఖరారు చేసింది.