పినరయి విజయన్ కూతురుకి చుక్కెదురు.. ఈడీ దర్యాప్తుపై కేరళ హైకోర్టు కీలక తీర్పు!
- వీణా విజయన్ కంపెనీకి సీఎంఆర్ఎల్ సంస్థ నుంచి పేమెంట్లు
- క్షేత్ర స్థాయిలో ఎలాంటి పని జరగకుండానే చెల్లింపులు
- ఈడీ దర్యాప్తు కొనసాగవచ్చని స్పష్టం చేసిన కేరళ హైకోర్టు
కేరళ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన 'ఎక్సాలాజిక్ సొల్యూషన్స్' వ్యవహారంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ సంస్థపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జరుపుతున్న మనీ లాండరింగ్ దర్యాప్తును సవాల్ చేస్తూ... కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ (CMRL) దాఖలు చేసిన అప్పీల్‌ను కేరళ హైకోర్టు కొట్టివేసింది. ఈడీ దర్యాప్తు యథావిధిగా కొనసాగవచ్చని స్పష్టం చేసింది.
వీణా విజయన్‌కు చెందిన ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ అనేది స్కూల్, కాలేజీ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ తయారు చేసే ఒక చిన్న సంస్థ. ఈ సంస్థను సీఎంఆర్ఎల్ (CMRL) అనే పబ్లిక్ సెక్టార్ లింక్డ్ కంపెనీ ఐటీ కన్సల్టెంట్‌గా నియమించుకుంది. ఇందుకోసం ఎక్సాలాజిక్ సంస్థకు నెలకు రూ.3 లక్షలు, అలాగే వ్యక్తిగత కన్సల్టెన్సీ కింద వీణా విజయన్‌కు నెలకు మరో రూ.5 లక్షలు చెల్లించారు. ఇలా ఐటీ, కన్సల్టెన్సీ సేవల పేరుతో మొత్తం రూ. 2.78 కోట్లను సీఎంఆర్ఎల్ సంస్థ వీణా విజయన్‌కు, ఆమె కంపెనీకి బదిలీ చేసింది.
అయితే, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (SFIO) జరిపిన విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నిధుల బదిలీకి సంబంధించి ఎలాంటి సాఫ్ట్వేర్ అభివృద్ధి చేయలేదని, అసలు క్షేత్రస్థాయిలో పనే జరగలేదని నివేదిక పేర్కొంది. ఇరు కంపెనీల ఉద్యోగులు కూడా ఎలాంటి సర్వీసులు అందలేదని స్టేట్మెంట్స్ ఇచ్చారు. వీరి మధ్య జరిగిన ఈ-మెయిల్స్ కేవలం బిల్లులు పంపడం, పేమెంట్లు రిలీజ్ చేసుకోవడానికే పరిమితమయ్యాయని విచారణలో తేలింది.
అంతేకాకుండా, సీఎంఆర్ఎల్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్‌కు లింక్ ఉన్న ఒక ఫైనాన్స్ కంపెనీ.. ఎక్సాలాజిక్ సంస్థకు రూ. 25 లక్షల చొప్పున రెండు విడతలుగా లోన్లు ఇచ్చింది. మొదటి లోన్ తిరిగి చెల్లించకపోయినా రెండో లోన్ ఇవ్వడం, ఆ తర్వాత సీఎంఆర్ఎల్ నిధులను ఈ లోన్లు క్లియర్ చేయడానికి వాడటం జరిగింది. మినరల్స్ కంపెనీ అయిన సీఎంఆర్ఎల్ సంస్థలో కేరళ ప్రభుత్వానికి 13 శాతం వాటా ఉంది. ఈ లావాదేవీల కారణంగా ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లిందని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.
ఈ మొత్తం వ్యవహారాన్ని మనీ లాండరింగ్ కేసుగా పరిగణిస్తూ ఈడీ రంగంలోకి దిగింది. ఇటీవల సీఎం పినరయి విజయన్, ఆయన కుమార్తె వీణా విజయన్‌కు లింక్ ఉన్న ఆస్తులపై సోదాలు కూడా నిర్వహించింది. అయితే తనపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలని, తమ లావాదేవీలన్నీ చట్టబద్ధంగా, పారదర్శకంగా జరిగాయని వీణా విజయన్ వాదిస్తున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కావాలనే ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేస్తూ... రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఈ ఈడీ దర్యాప్తు చేయిస్తోందని సీపీఎం పార్టీ మండిపడుతోంది. ఏది ఏమైనప్పటికీ, హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ కేరళ 'ఐటీ' స్కామ్ దర్యాప్తు మున్ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.