జై షా - పాకిస్థాన్ కెప్టెన్ కరచాలనం.. సోషల్ మీడియాలో హీటెక్కిన చర్చ!
- ఈ నెల 12న ప్రారంభమవుతున్న టీ20 మహిళల వరల్డ్ కప్
- నిన్న జరిగిన కార్యక్రమంలో పాక్ కెప్టెన్ ఫాతిమాతో జై షా కరచాలనం
- భారత్ నో హ్యాండ్‌షేక్ పాలసీని గుర్తు చేస్తున్న పాక్ అభిమానులు
2026 ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందే ఒక చిన్న కరచాలనం సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతోంది. ఇంగ్లండ్‌లో నిన్న (జూన్ 7) జరిగిన ‘కెప్టెన్స్ కార్నివాల్’ ఈవెంట్లో ఐసీసీ ఛైర్మన్ జై షా, పాకిస్థాన్ మహిళా జట్టు కెప్టెన్ ఫాతిమా సనాతో కరచాలనం చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ కావడంతో భారత్, పాకిస్థాన్ అభిమానుల మధ్య పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.
క్రీడా స్ఫూర్తా? దౌత్య నీతా?
జై షా చేసిన ఈ పనిని కొందరు క్రీడా స్ఫూర్తికి నిదర్శనంగా అభివర్ణిస్తుంటే, మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు. ముఖ్యంగా గతంలో ద్వైపాక్షిక సిరీస్‌ల సమయంలో భారత్ అనుసరించిన ‘నో హ్యాండ్‌షేక్’ పాలసీని పాక్ అభిమానులు గుర్తుచేస్తున్నారు. అయితే భారత అభిమానులు మాత్రం జై షాను వెనకేసుకొస్తున్నారు. ఆయన ఐసీసీ ఛైర్మన్ హోదాలో ఉన్నారని, ఆ పదవిలో ఉన్నప్పుడు అన్ని దేశాలను సమానంగా చూడటం, సభ్య దేశాల ప్రతినిధులతో దౌత్యపరమైన సంబంధాలు కొనసాగించడం ఆయన కనీస బాధ్యత అని స్పష్టం చేస్తున్నారు. పుల్వామా ఉగ్రదాడి తర్వాత అధికారిక కార్యక్రమాల్లో కూడా భారత ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లకు దూరంగా ఉండేవారు. ఇప్పుడు జై షా తీరు ఆ పాత జ్ఞాపకాలను మళ్లీ తెరపైకి తెచ్చింది.
ఇక టోర్నమెంట్ విషయానికి వస్తే..
జూన్ 12: ఇంగ్లండ్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్‌తో వరల్డ్ కప్ ప్రారంభం కానుంది.
జూన్ 14: క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ వర్సెస్ పాకిస్థాన్ పోరు బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో జరగనుంది.
డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉన్న న్యూజిలాండ్ ఈసారి కూడా తన టైటిల్‌ను కాపాడుకునేందుకు ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.