వైట్ వర్సెస్ బ్రౌన్: పోషకాల పరంగా ఏ గుడ్లు బెస్ట్?
- బ్రౌన్ గుడ్లలోనే ఎక్కువ పోషకాలుంటాయనడం భ్రమ
- రెండు రకాల గుడ్లలోనూ పోషకాలు సమానం
- పెంకు రంగు కేవలం కోడి జాతిపైనే ఆధారపడి ఉంటుంది
- కోడి ఆహారమే గుడ్డు పోషకాలను మారుస్తుంది
- రంగు వల్ల గుడ్డు రుచిలో తేడాలుండవు
రంగుల భేదం
కోడిగుడ్ల రంగులనేవి పూర్తిగా ఆ కోడి జాతిపై ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు ‘వైట్ లెగ్హార్న్’ జాతి కోళ్లు తెల్లటి గుడ్లను పెడతాయి. అలాగే ‘ప్లైమౌత్ రాక్స్’ జాతి కోళ్లు బ్రౌన్ కలర్ గుడ్లను ఇస్తాయి. కొన్ని విదేశీ జాతి కోళ్లయితే ఏకంగా బ్లూ లేదా గ్రీన్ కలర్ గుడ్లను కూడా పెడతాయి.
పెంకు రంగుల వెనుక
కోళ్ల శరీరంలో సహజంగా ఉత్పత్తయ్యే పిగ్మెంట్ల (రంగు పదార్థాలు) వల్లే ఈ మార్పు వస్తుంది. బ్రౌన్ గుడ్ల పెంకులో ‘ప్రోటోపోర్ఫిరిన్ IX’ అనే పిగ్మెంట్ ఉంటుంది. ఇది రక్తం ఎరుపు రంగుకు కారణమయ్యే కాంపౌండ్ నుంచే తయారవుతుంది. కోడి వయసు పెరిగే కొద్దీ బ్రౌన్ గుడ్ల రంగు కాస్త పలచబడుతుంది.
పోషకాల పరంగా
రంగు ఏదైనప్పటికీ అన్ని గుడ్లలో ఉండే పోషకాలు దాదాపు ఒక్కటేనని శాస్త్రవేత్తలు తేల్చారు. పెంకు రంగు వల్ల గుడ్డు నాణ్యతలో ఎలాంటి తేడాలు ఉండవు. ఒక సాధారణ గుడ్డులో 80 కంటే తక్కువ క్యాలరీలు ఉంటాయి. అందులో శరీరానికి కావలసిన విటమిన్లు, మినరల్స్, నాణ్యమైన ప్రోటీన్లు సమానంగా లభిస్తాయి.
కోడి ఆహారాన్ని బట్టి
గుడ్డులోని పోషకాలు కోడి పెరిగే వాతావరణం, తినే ఆహారంపై ఆధారపడి ఉంటాయి. ఎండలో తిరిగే కోళ్లు పెట్టే గుడ్లలో విటమిన్-డి నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది. అలాగే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారం తినిపించే కోళ్ల గుడ్లలో ఆ పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కోడికి పెట్టే దానాయే ముఖ్యం.
రుచిలో తేడాలుండవు
బ్రౌన్ గుడ్లు ఎక్కువ రుచిగా ఉంటాయని కొందరు అనుకోవడం కేవలం భ్రమ మాత్రమే. రంగు వల్ల రుచి మారదని, కేవలం తాజాదనం వల్లే రుచి మారుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇళ్ల వద్ద నాటు కోళ్లు పెట్టే గుడ్లు నేరుగా ప్లేట్లోకి రావడం వల్ల అవి ఎక్కువ రుచిగా అనిపిస్తాయి.
ధరల వ్యత్యాసానికి కారణం
మార్కెట్లో వైట్ గుడ్ల కంటే బ్రౌన్ గుడ్ల ధర ఎప్పుడూ కాస్త ఎక్కువగానే ఉంటుంది. గతంలో బ్రౌన్ గుడ్లు పెట్టే కోళ్లు పెద్దగా ఉండి, తక్కువ గుడ్లు పెట్టేవి. వాటి ఖర్చుల కోసమే ధర పెంచేవారు. కానీ ఇప్పుడు ఉత్పత్తి ఖర్చులు సమానంగా ఉన్నప్పటికీ ఆర్గానిక్ పేరుతో బ్రౌన్ గుడ్లను ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు.
లేబుల్స్ అర్థాలు ఇవే
మనం కొనే గుడ్ల పెట్టెలపై రకరకాల లేబుల్స్ రాసి ఉంటాయి. ‘ఆర్గానిక్’ అంటే రసాయనాలు లేని ఆహారం తినిపించిన కోళ్ల గుడ్లు అని అర్థం. ‘కేజ్-ఫ్రీ’ అంటే పంజరాల్లో కాకుండా కేవలం గదుల్లో పెంచే కోళ్లు. ‘ఫ్రీ-రేంజ్’ అంటే బయట ప్రకృతిలో, ఎండలో తిరిగే కోళ్లు అని అర్థం చేసుకోవాలి.