యూపీఐ పేమెంట్‌లో పొరపాటు.. వెతికి మరీ డబ్బులు తిరిగిచ్చిన డ్రైవర్

Shubham Gune pays 15682 instead of 156 to honest Mumbai auto driver
  • ముంబై వ్యాపారవేత్త శుభమ్ గునే పొరపాటు 
  • మీటింగ్‌కు వెళ్లే హడావుడిలో పెద్దమొత్తంలో ఆటో డ్రైవర్‌కు డబ్బులు ట్రాన్స్‌ఫర్
  • అదనపు మొత్తాన్ని చూసి ఆయన తిరిగి వచ్చే వరకు అక్కడే ఉన్న ఆటోవాలా
  • శుభమ్ రాగానే రూపాయి కూడా ఉంచుకోకుండా మొత్తం  డబ్బులు వెనక్కి
  • ఆటో చార్జీ అయినా తీసుకోవాలని కోరినా నిరాకరణ
డిజిటల్ చెల్లింపులు (UPI Payments) మన జీవితాన్ని ఎంత సులభతరం చేశాయో.. ఒక్కోసారి చిన్న అజాగ్రత్త వల్ల అంతే పెద్ద తలనొప్పులను తెచ్చిపెడుతుంటాయి. అయితే, ముంబైలో జరిగిన ఒక ఘటన మాత్రం సాంకేతిక పొరపాటును అధిగమించి, మానవత్వానికి, నిజాయతీకి సరికొత్త నిదర్శనంగా నిలిచింది. ఒక ప్రముఖ స్టార్టప్ వ్యవస్థాపకుడు హడావుడిలో ఆటో డ్రైవర్‌కు రూ. 156 ఆటో ఛార్జీకి బదులుగా ఏకంగా రూ. 15,682 ట్రాన్స్‌ఫర్ చేయగా.. ఆ డ్రైవర్ చూపిన నిజాయతీ సోషల్ మీడియాలో అందరి హృదయాలను గెలుచుకుంటోంది.

'హింగ్లిష్' (Hinglish) సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో అయిన శుభమ్ గునే ఒక రోజు ఉదయం అత్యంత కీలకమైన క్లయింట్ మీటింగ్‌కు వెళ్లే క్రమంలో ఒక ఆటో ఎక్కారు. గమ్యస్థానానికి చేరుకున్నాక, తీవ్రమైన పని ఒత్తిడి,  హడావుడిలో ఉన్న ఆయన మొబైల్ యాప్ ద్వారా డిజిటల్ పేమెంట్ చేశారు. ఆ సమయంలో నంబర్లను తప్పుగా టైప్ చేయడంతో రూ. 156 కి బదులుగా రూ. 15,682 డ్రైవర్ ఖాతాలోకి వెళ్లాయి. అది గమనించకుండానే శుభమ్ తన మీటింగ్‌కు వెళ్ళిపోయారు.

నిజాయతీతో పాటు ఉదారత్వం 
దురదృష్టవశాత్తూ శుభమ్ హాజరైన ఆ బిజినెస్ మీటింగ్ ఘోరంగా విఫలమైంది. దానితో తీవ్ర నిరాశ, ఒత్తిడితో ఆయన తిరిగి ఆటో దిగిన ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఒక ఊహించని ఘటన ఎదురైంది. ఆటో డ్రైవర్ అల్తాఫ్ అప్పటికే అక్కడే ఆగి శుభమ్ కోసం ఎదురుచూస్తున్నాడు. శుభమ్‌ను చూడగానే పిలిచిన అల్తాఫ్.. పొరపాటున తన ఖాతాలో పడిన అదనపు మొత్తాన్ని (రూ. 15,682) చూపించి, ఆ డబ్బును పూర్తిగా తిరిగి ఇచ్చేశాడు.

ఈ నిజాయతీకి అబ్బురపడిన శుభమ్.. కనీసం ఆటో ఛార్జీ రూ. 156 అయినా ఉంచుకోవాలని ఎంత బతిమాలినా అల్తాఫ్ తీసుకోలేదు. "బాబూ.. మీ ముఖం చూస్తేనే తెలుస్తోంది, ఈ రోజు మీకు కలిసి రాలేదని. ఇప్పటికే కష్టాల్లో ఉన్న మీ రోజును నా కారణంగా నేను మరింత ఇబ్బందికరంగా మార్చదలచుకోలేదు. ఈ ఛార్జీ కూడా నాకు వద్దు" అని అల్తాఫ్ సమాధానమిచ్చాడు.

ఈ హృదయపూర్వక సంఘటనను శుభమ్ గునే తన లింక్డ్‌ఇన్ (LinkedIn) ఖాతాలో పంచుకోగా, అది కాసేపట్లోనే విపరీతంగా వైరల్ అయింది. ముంబై లాంటి నగరంలో రూపాయి కోసం అడ్డదారులు తొక్కే ఈ రోజుల్లో.. అల్తాఫ్ లాంటి సామాన్య ఆటో డ్రైవర్ చూపిన ఉదారత్వం, నిజాయతీ నిజంగా గ్రేట్ అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఒక చేదు అనుభవంతో మొదలైన ఆ రోజు, ఒక మంచి మనిషి పరిచయంతో జీవితాంతం గుర్తుండిపోయే తీపి గుర్తుగా మారిందని శుభమ్ కృతజ్ఞత భావంతో పేర్కొన్నారు.
Go Back to Shorts
Shubham Gune
Altaf Auto Driver
Mumbai
UPI payment error
Hinglish CEO
Honest auto driver
Viral LinkedIn story
Digital payments
Mumbai news
Humanity story

More Telugu News