గుడ్డిగా ఫాలో అవ్వాలా? మేము గొర్రెలం కాదు: నాగబాబుకు ప్రకాశ్ రాజ్ కౌంటర్
- నాయకుడి మాటే శాసనం అన్న నాగబాబు
- ఎలాంటి ప్రశ్నలు అడగకండి అని ట్వీట్
- నాయకుడు ఎవరైనా సరే ప్రజలకు సమాధానం చెప్పాల్సిందేనన్న ప్రకాశ్ రాజ్
సినీ నటులు కొణిదెల నాగబాబు, ప్రకాశ్ రాజ్ మధ్య సోషల్ మీడియా వేదికగా మరోసారి తీవ్రస్థాయిలో మాటల యుద్ధం మొదలైంది. మెగా బ్రదర్ నాగబాబు తన 'ఎక్స్' ఖాతాలో తన తమ్ముడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫొటోను షేర్ చేస్తూ లీడర్‌షిప్‌పై ఆసక్తికరమైన, కాస్త ఘాటు వ్యాఖ్యలు చేశారు.
"నాయకుడి మాటే శాసనం. ఆయన ప్రయాణంలో ఎదుర్కొనే రాక్షసులను, అడ్డంకులను ఎవరూ చూడరు. ఏది తప్పు, ఏది రైట్ అనేది కేవలం ఆ లీడర్‌కు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి మీ సందేహాలను పక్కన పెట్టండి, నోళ్లు మూసుకోండి, ఎలాంటి ప్రశ్నలు అడగకండి. జస్ట్ మీ లీడర్‌ను గుడ్డిగా ఫాలో అవ్వండి" అంటూ నాగబాబు రాసుకొచ్చారు.
నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యలపై నటుడు ప్రకాశ్ రాజ్ తీవ్రంగా స్పందించారు. నాగబాబు ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ గట్టి కౌంటర్ ఇచ్చారు. "అసలు మీ ఉద్దేశం ఏంటి నాగబాబు గారు? 'సందేహాలు పక్కన పెట్టి, నోళ్లు మూసుకుని లీడర్‌ను గుడ్డిగా ఫాలో అవ్వాలా?' మేము గొర్రెలం కాదు, బానిసలుగా బతకడానికి మాకు ఆసక్తి లేదు. మమ్మల్ని బెదిరించకండి. ప్రశ్నించడం అనేది మా ప్రాథమిక హక్కు. నాయకుడు ఎవరైనా సరే... చివరికి తనే దేవుడు అనుకున్నా సరే... ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆ నాయకుడిపై ఉంది. అర్థమైందా?" అంటూ ప్రకాశ్ రాజ్ ఘాటుగా సమాధానమిచ్చారు.
పవన్ కల్యాణ్ నాయకత్వాన్ని సమర్థిస్తూ నాగబాబు చేసిన ట్వీట్, దానికి ప్రకాశ్ రాజ్ 'ప్రశ్నించే హక్కు' అంటూ ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు టాలీవుడ్‌తో పాటు అటు ఏపీ, ఇటు తెలంగాణ రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.