తమిళనాడు రాజకీయాల్లో భారీ కుదుపు.. టీవీకే గూటికి మాజీ మంత్రులు?

  • ఆదివారం టీవీకేలోకి సి.వి.షణ్ముగం, సి.విజయభాస్కర్?
  • విశ్వాస పరీక్షలో విజయ్ ప్రభుత్వానికి షణ్ముగం వర్గం అనుకూల ఓటు
  • ఇప్పటికే టీవీకేలో చేరిన పలువురు అన్నాడీఎంకే నేతలు
  • వలసలతో మరింత బలం పుంజుకుంటున్న టీవీకే
తమిళనాడు రాజకీయాల్లో ఎన్నికల అనంతర సమీకరణాలు అత్యంత వేగంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రతిపక్ష శిబిరంలో మొదలైన అలజడి ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే (AIADMK)కు చెందిన ఇద్దరు కీలక నేతలు, మాజీ మంత్రులు సి.వి.షణ్ముగం, సి.విజయభాస్కర్‌లు తమ అనుచరులతో కలిసి అధికార తమిళగ వెట్రి కళగం (TVK)లో చేరబోతున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఆదివారం చెన్నై శివార్లలోని పనైయూర్‌లో గల టీవీకే పార్టీ ప్రధాన కార్యాలయంలో ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ సమక్షంలో వీరు పార్టీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే 107 స్థానాల్లో విజయం సాధించి ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే, ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 118 సీట్ల మ్యాజిక్ ఫిగర్‌కు కొద్దిగా దూరంలో నిలిచింది. ఈ క్రమంలో గతంలో డీఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తొలుత విజయ్‌కు మద్దతు ప్రకటించి బయటకు వచ్చింది. ప్రతిగా కాంగ్రెస్‌కు రెండు మంత్రి పదవులతో పాటు ఒక రాజ్యసభ స్థానాన్ని కూడా టీవీకే కేటాయించింది. ఆ తర్వాత వీసీకే (VCK), ఐయూఎంఎల్ (IUML) కూడా ప్రభుత్వంలో చేరి చెరో మంత్రి పదవిని దక్కించుకోగా.. సీపీఎం, సీపీఐ ప్రభుత్వానికి బేషరతుగా వెలుపల నుంచి మద్దతు ఇస్తున్నాయి.

కూల్చిన అసమ్మతి కోట - బలపడుతున్న విజయ్
అసెంబ్లీలో ముఖ్యమంత్రి విజయ్ విశ్వాస పరీక్ష (Confidence Vote)ను ఎదుర్కోవడానికి ముందే అన్నాడీఎంకేలో ఎస్.పి.వేలుమణి, సి.వి.షణ్ముగం నేతృత్వంలోని ఒక అసమ్మతి వర్గం ప్రత్యేక గ్రూపుగా ఏర్పడింది. నాడు జరిగిన ముందస్తు చర్చల ఫలితంగా.. విశ్వాస పరీక్షలో వేలుమణి-షణ్ముగం వర్గానికి చెందిన 25 మంది ఎమ్మెల్యేలతో పాటు ఏఎంఎంకే (AMMK)కి చెందిన ఎమ్మెల్యే కామరాజ్ కూడా టీవీకే ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. ఆ వెంటనే మరగతం కుమారవేల్, జయకుమార్, సత్యభామ, ఇసక్కి సుబ్బయ్య వంటి ఏఐఏడీఎంకే శాసనసభ్యులు తమ పదవులకు రాజీనామా చేసి అధికారికంగా టీవీకేలో చేరిపోయారు.

ఆ తర్వాత ఎస్.పి.వేలుమణి నేతృత్వంలోని కొందరు ఎమ్మెల్యేలు తిరిగి పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె.పళనిస్వామి (EPS) చెంతకు చేరినప్పటికీ, సి.వి.షణ్ముగం, సి.విజయభాస్కర్ వంటి సీనియర్లు మాత్రం పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి వెల్లమండి నటరాజన్ వంటి నేతలు టీవీకే గూటికి చేరగా.. ఇప్పుడు ఉత్తర తమిళనాడులో బలమైన పట్టున్న షణ్ముగం, కావేరి డెల్టా పరిధిలో పట్టున్న విజయభాస్కర్ కూడా టీవీకే వైపు అడుగులు వేస్తుండటం తమిళ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ వలసలు గనుక నిజమైతే అసెంబ్లీలో, క్షేత్రస్థాయిలో ముఖ్యమంత్రి విజయ్ స్థానం మరింత పటిష్ఠం కావడం ఖాయం.

Vijay
Tamilaga Vettri Kazhagam
AIADMK
CV Shanmugam
C Vijayabaskar
Tamil Nadu Politics
Edappadi K Palaniswami
TVK Party
Tamil Nadu Assembly
Political Defections

More Telugu News