రామానాయుడు స్టూడియోలో నా ఫొటో ఉండాలనే కోరిక నెరవేరింది: ప్రియమణి
- చాలా ఏళ్ల క్రితం రామానాయుడు స్టూడియోలో అందంగా అలంకరించిన హీరోయిన్ల ఫొటోలు చూశానన్న ప్రియమణి
- వాళ్లంతా సురేష్ ప్రొడక్షన్స్ లో నటించిన హీరోయిన్లని తెలిసిందని వెల్లడి
- తన ఫొటో కూడా ఆ గోడపై స్థానం సంపాదించుకోవాలని అనుకున్నానన్న ప్రియమణి
- 'నారప్ప'తో తన కల నెరవేరిందని వెల్లడి
నేషనల్ అవార్డ్ విన్నర్, సీనియర్ నటి ప్రియమణి టాలీవుడ్‌తో పాటు పలు భాషల్లో విభిన్నమైన పాత్రలు పోషిస్తూ దేశవ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. కొంతకాలం క్రితం విక్టరీ వెంకటేష్ హీరోగా, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ‘నారప్ప’ చిత్రంలో ఆమె పోషించిన సుందరమ్మ పాత్రకు ప్రేక్షకులు, విమర్శకుల నుండి భారీ ప్రశంసలు దక్కాయి. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సురేష్ బాబు నిర్మించిన ఈ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదలై పెద్ద సక్సెస్ సాధించింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రియమణి మాట్లాడుతూ... ఈ సినిమాకు సంబంధించి, అలాగే తన కెరీర్‌కు సంబంధించిన ఒక కీలక విషయాన్ని పంచుకుంది.
"చాలా ఏళ్ల క్రితం నేను రామానాయుడు స్టూడియోలో షూటింగ్ చేస్తున్న సమయంలో, అక్కడ ఒక గోడపై ఎంతోమంది ప్రముఖ నటీమణుల ఫొటోలు అందంగా అలంకరించి ఉండటం చూశాను. అప్పట్లో వాటి ప్రాధాన్యత నాకు పూర్తిగా తెలియదు. కానీ ఆ తర్వాత తెలిసింది.. వారంతా ప్రతిష్ఠాత్మక 'సురేష్ ప్రొడక్షన్స్' బ్యానర్‌లో నటించిన లెజెండరీ హీరోయిన్లు అని. ఆ రోజే నా మనసులో ఒక బలమైన కోరిక కలిగింది.. ఎలాగైనా భవిష్యత్తులో ఆ గోడపై నా ఫొటో కూడా స్థానం సంపాదించుకోవాలని అనుకున్నాను" అని చెప్పుకొచ్చింది.
డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ఒక గొప్ప విజన్ ఉన్న దర్శకుడని, నారప్ప చిత్రాన్ని ఎంతో అద్భుతంగా, భావోద్వేగభరితంగా తెరకెక్కించారని కొనియాడింది. ‘నారప్ప’ సినిమాలో నటించడం వల్లే ఈ రోజు రామానాయుడు స్టూడియోలో ఆ హీరోయిన్ల ఫొటోల పక్కన తన ఫొటో కూడా చేరిందని, ఆ కోరిక నెరవేరడం తనకు ఎంతో గర్వంగా, సంతోషంగా ఉందని ప్రియమణి భావోద్వేగానికి లోనైంది.