డీకే శివకుమార్‌కు షాక్.. శాఖ నచ్చలేదని మంత్రి రాజీనామా
- మంత్రిపదవికి రామలింగారెడ్డి రాజీనామా
- బెంగళూరు అభివృద్ధి శాఖ దక్కకపోవడంతో అసంతృప్తి
- డీకే శివకుమార్ మాట తప్పారని ఆరోపణ
- కెమెరా ముందే రాజీనామా లేఖపై సంతకం
- ఎమ్మెల్యేగా కొనసాగుతానని ప్రకటన
ముఖ్యమంత్రి అయిన తర్వాత బెంగళూరు అభివృద్ధి శాఖను తనకు అప్పగిస్తానని డీకే శివకుమార్ గతంలో ఇంటికి వచ్చి మరీ మాటిచ్చారని రామలింగారెడ్డి మీడియా ముందు చెప్పారు. ప్రమాణ స్వీకారానికి ముందు రోజు కూడా డీకేఎస్‌ను కలిసినప్పుడు ఇదే శాఖ ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు మాట తప్పారని ఆరోపించారు. తనకు జరిగిన ఈ అవమానంతో నిరాశకు గురయ్యానని, అందుకే మంత్రి పదవిని వదులుకుంటున్నట్లు స్పష్టం చేశారు. అయితే తాను కేవలం మంత్రి పదవికి మాత్రమే రాజీనామా చేస్తున్నానని, కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ఎమ్మెల్యేగా కొనసాగుతానని స్పష్టం చేశారు. ఈ విషయంలో తనకు సిద్ధరామయ్యపై గానీ, శివకుమార్‌పై గానీ ఎలాంటి వ్యక్తిగత కోపం లేదన్నారు.
ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నేత రామలింగారెడ్డి.. బెంగళూరు అభివృద్ధి శాఖ మినహా మరే ఇతర శాఖను తీసుకోనని ముందే తేల్చి చెప్పారు. అయినప్పటికీ ఆయనకు ‘భారీ, మధ్య తరహా నీటిపారుదల’ శాఖను కేటాయించడంతో ఈ వివాదం మొదలైంది. గతంలో సిద్ధరామయ్య ప్రభుత్వంలో రవాణా, హోం శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన.. తన రాజీనామా లేఖను స్వయంగా సీఎంకు ఇవ్వకుండా ఓ వ్యక్తి ద్వారా ప్రధాన కార్యదర్శికి పంపారు. బెంగళూరు అభివృద్ధి శాఖను కృష్ణ బైరేగౌడకు కేటాయించడమే ఈ మొత్తం రాజీనామా డ్రామాకు కారణమైంది.