ఖమేనీతో భేటీ గౌరవంగా భావిస్తా.. ట్రంప్ వైఖరిలో కీలక మార్పు!
- ఇరాన్ సుప్రీం లీరడ్‌తో భేటీకి సిద్ధమన్న ట్రంప్
- యురేనియం విషయంలో ట్రంప్ వైఖరిలో కీలక మార్పు
- శుద్ధి చేసిన యురేనియాన్ని ఇరాన్ బయటకు తరలించాల్సిన అవసరం లేదని స్పష్టం
- దాడిలో ఖమేనీ కుటుంబం మరణించినట్లు వెల్లడి
- అయినా ఇరాన్ కొత్త నేత ప్రొఫెషనల్‌గా ఉంటారని ఆశాభావం
ఖమేనీతో భేటీకి సిద్ధం
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరితే.. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీతో భేటీకి సిద్ధమని ట్రంప్ ప్రకటించారు. దాన్ని తనకు దక్కిన గౌరవంగా భావిస్తానని చెప్పారు. ఇరు దేశాల మధ్య సయోధ్య కుదిరితే మాత్రం ఆయనను కచ్చితంగా కలుస్తానని చెప్పారు. గత ఫిబ్రవరి 28న జరిగిన అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో మొజ్తబా తండ్రి, మాజీ అధినేత అలీ ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాతే 54 ఏళ్ల మొజ్తబా.. ఇరాన్ అత్యున్నత నేతగా బాధ్యతలు చేపట్టారు.
వ్యక్తిగత వైరాన్ని పక్కనబెట్టి
అమెరికా, ఇజ్రాయెల్ దళాలు జరిపిన దాడుల్లో మొజ్తబా ఖమేనీ తండ్రితో పాటు ఆయన భార్య, కుమారుడు కూడా ప్రాణాలు కోల్పోయారని ట్రంప్ గుర్తు చేశారు. ‘‘మేం ఆయన తండ్రిని, భార్యను, కొడుకును చంపాం. కాబట్టి నేను అతనికి నచ్చకపోవచ్చు. కానీ కొన్ని వర్గాల్లో ఆయనకు చాలా మంచి పేరుంది’’ అని ట్రంప్ అన్నారు. గతంలో జరిగిన దాడుల వల్ల ఖమేనీకి తమపై కోపం ఉండటం సహజమేనని.. అయినప్పటికీ దేశ ప్రయోజనాల కోసం చర్చలు జరిపేటప్పుడు ఆయన ఒక ప్రొఫెషనల్‌గా వ్యవహరిస్తారని భావిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.