తుపాకీ వదిలి.. న్యాయశాస్త్రం వైపు అడుగులు.. లాసెట్‌లో మెరిసిన మాజీ మావోయిస్ట్ నేత దేవ్‌జీ

Devji former Maoist leader leaves gun for law books and clears LAWCET
  • 5 ఏళ్ల లా కోర్సులో 349వ ర్యాంకు సాధించిన దేవ్‌జీ
  • పేదలకు ఉచిత న్యాయ సహాయం అందించడమే తన లక్ష్యమని వెల్ల‌డి
  • 50 ఏళ్లు పైబడిన వయసులోనూ పట్టుదలతో చదివి అర్హత సాధించిన వైనం 
ఒకప్పుడు దండకారణ్యంలో తుపాకీ పట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన చేతులు ఇప్పుడు న్యాయశాస్త్ర పుస్తకాలు పట్టనున్నాయి. మావోయిస్టు మాజీ అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ, తన కొత్త జీవిత ప్రయాణంలో కీలక అడుగు వేశారు. తెలంగాణలో నిర్వహించిన లాసెట్ (లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ప్రవేశ పరీక్షలో ఆయన అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. ఐదేళ్ల న్యాయ విద్య కోర్సు కోసం రాసిన ఈ పరీక్షలో 57 మార్కులు సాధించి, 349వ ర్యాంకుతో అర్హత పొందారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో పోలీసుల ఎదుట లొంగిపోయిన దేవ్‌జీ, జనజీవన స్రవంతిలో కలిసిన కొద్ది నెలల్లోనే ఈ ఘనత సాధించడం విశేషం. 1980-82 మధ్యకాలంలో కోరుట్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ (ఎంపీసీ) చదివిన ఆయనకు, అప్పట్లో తెలుగు సబ్జెక్టులో ఉత్తీర్ణత సాధించ‌లేదు. న్యాయ విద్య చదవాలన్న సంకల్పంతో ఇటీవలే ఇంటర్ బోర్డు నుంచి ప్రత్యేక అనుమతి పొంది మే 13న ఇంటర్ ద్వితీయ సంవత్సరం తెలుగు పరీక్ష రాశారు. ఆ ఫలితాలు ఇంకా వెలువడక ముందే, లాసెట్‌లో మంచి ర్యాంకు సాధించడం ఆయన పట్టుదలకు నిదర్శనం. యాభై ఏళ్లు పైబడిన వయసులోనూ చదువుపై ఆసక్తితో ఈ విజయం సాధించిన దేవ్‌జీ, భవిష్యత్తులో లాయర్‌గా మారి పేద, నిరుపేదలకు ఉచితంగా న్యాయ సహాయం అందించడమే తన లక్ష్యమని చెబుతున్నారు.

లాసెట్‌లో 73 శాతం ఉత్తీర్ణత
మరోవైపు గురువారం విడుదలైన లాసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో మొత్తం 73 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఈ పరీక్షకు మొత్తం 66,864 మంది దరఖాస్తు చేసుకోగా, 54,374 మంది హాజరయ్యారు. వీరిలో 39,673 మంది కన్వీనర్ కోటా సీట్లకు అర్హత పొందారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ.. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆదేశాల ప్రకారం లా కోర్సుల్లో చేరిన విద్యార్థులకు 75 శాతం హాజరు తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఈ ఏడాది 60 ఏళ్లు పైబడిన వారిలో మూడేళ్ల ఎల్‌ఎల్‌బీలో 348 మంది, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీలో 21 మంది, ఎల్‌ఎల్‌ఎంలో 82 మంది అర్హత సాధించడం గమనార్హం. అలాగే, అర్హత పొందిన వారిలో 7,252 మంది బీటెక్ పూర్తి చేసిన వారు ఉండటం న్యాయ విద్యపై పెరుగుతున్న ఆసక్తిని సూచిస్తోంది.
Go Back to Shorts
Devji
Thippiri Tirupathi
TS LAWCET
Former Maoist Leader
Telangana Law Entrance Exam
Law Common Entrance Test Results
Maoist Devji LAWCET Rank
Legal Education Telangana
Law Entrance Exam Results 2024

More Telugu News