ఎవరెస్ట్‌పై అద్భుతం.. ఆరు రోజులు ఆహారం, ఆక్సిజన్ లేకున్నా బతికొచ్చిన షెర్పా గైడ్!

  • ఎవరెస్ట్‌పై ఆరు రోజులపాటు నిలిచిన ప్రాణం
  • బేస్ క్యాంప్ వద్ద షెర్పా దావా గుర్తింపు
  • ఆహారం, ఆక్సిజన్ లేకుండానే జీవనం
  • ఆనందబాష్పాలతో కుటుంబ సభ్యుల భావోద్వేగం
  • కాఠ్మండు ఆసుపత్రికి ఎయిర్‌లిఫ్ట్
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతమైన ఎవరెస్ట్ శిఖరంపై ఊహించని అద్భుతం జరిగింది. మైనస్ డిగ్రీల చలి, సరైన ఆక్సిజన్ లేని వాతావరణంలో, తినడానికి ఆహారం, తాగడానికి నీరు కూడా లేకుండా దాదాపు ఆరు రోజుల పాటు ఒంటరిగా గడిపిన ఒక నేపాలీ షెర్పా గైడ్ ప్రాణాలతో తిరిగొచ్చాడు. 'హిల్లరీ దావా షెర్పా' (52) గా పిలిచే ఈ గైడ్ మృత్యువును జయించి వచ్చిన తీరును తోటి పర్వతారోహకులు, అధికారులు ఒక అసాధారణమైన మిరాకిల్‌గా అభివర్ణిస్తున్నారు.

మే 29న ఒక విదేశీ పర్వతారోహకుడిని సురక్షితంగా కిందికి దింపే క్రమంలో.. సుమారు 7,500 మీటర్ల ఎత్తులో ఉన్న క్యాంప్ 3 వద్ద దావా షెర్పా చివరిసారిగా కనిపించాడు. ఆ తర్వాత అతడు తన బృందంతో కలవకపోయాడు. దీంతో అతడి ఆచూకీ కోసం హెలికాప్టర్ ద్వారా గాలించినా ఫలితం లేకపోయింది. మంచు తుపానులో చిక్కుకుని చనిపోయాడని భావించిన అతడి కుటుంబ సభ్యులు లూక్లాలోని తమ నివాసంలో అంత్యక్రియల ఏర్పాట్లు కూడా ప్రారంభించారు.

అయితే, జూన్ 4న ఉదయం ఎవరెస్ట్ బేస్ క్యాంప్ సమీపంలోని ప్రమాదకరమైన 'ఖుంబు ఐస్‌ఫాల్' మంచు లోయల గుండా ఒక వ్యక్తి నెమ్మదిగా పాకుకుంటూ రావడం రూట్-సెట్టింగ్ బృందం కంటపడింది. దగ్గరకు వెళ్లి చూడగా అది దావా షెర్పా అని తెలిసి వారు షాక్‌కు గురయ్యారు. తీవ్రమైన చలి కారణంగా అతడి చేతులు, కాళ్లు గడ్డకట్టుకుపోయినప్పటికీ (ఫ్రాస్ట్‌బైట్), అతడు స్పృహలోనే ఉన్నాడు. వెంటనే అప్రమత్తమైన సహాయక సిబ్బంది హెలికాప్టర్ ద్వారా అతడిని కాఠ్మండులోని ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

మంచు పగుళ్లలో (Crevasse) ఆశ్రయం పొంది, మంచును నీరుగా మార్చుకుంటూ దావా ప్రాణాలు నిలుపుకున్నట్లు తెలుస్తోంది. తన తండ్రి బతికే ఉన్నాడనే వార్త తెలియగానే అతడి కుమార్తె మెండో లూయిస్ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఎవరెస్ట్ యాత్రల్లో వెన్నెముకగా నిలిచే షెర్పాల అసాధారణ పట్టుదలకు, శారీరక సామర్థ్యానికి ఈ ఘటనే నిదర్శనమని అంతర్జాతీయ పర్వతారోహణ సంఘం కొనియాడింది.

Hillary Dawa Sherpa
Mount Everest miracle
Sherpa guide survival
Khumbu Icefall
Mount Everest rescue
Nepal mountaineering
Everest survival story
Missing Sherpa found
Everest Base Camp
Hillary Dawa Sherpa survival

More Telugu News