ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాకిస్థాన్ విలవిల.. రక్షణ కోసం చైనా, టర్కీల వైపు చూపు!
- వైమానిక లోపాలను సరిదిద్దుకునే పనిలో పడ్డ పాకిస్థాన్
- చైనా లాంగ్-రేంజ్ హెచ్‌క్యూ-9 క్షిపణుల కొనుగోలుకు యత్నం
- టర్కీ అటాక్ డ్రోన్లు, లోయిటరింగ్ మ్యునిషన్లను తెప్పించుకుంటున్న పాక్
- మన బ్రహ్మోస్, ఆకాశ్ క్షిపణుల ధాటికి చైనా, టర్కీ రక్షణ వ్యవస్థలు విఫలమవడంతో పాక్ సరికొత్త వ్యూహం
- పాకిస్థాన్ కొత్త రక్షణ కొనుగోళ్లపై భారత్ నిఘా
విశ్వసనీయ నివేదికల ప్రకారం పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్.. చైనాకు చెందిన లాంగ్-రేంజ్ సర్ఫేస్-టు-ఎయిర్ క్షిపణి వ్యవస్థ 'హెచ్‌క్యూ-9' (HQ-9) తో పాటు హెచ్‌క్యూ-16, హెచ్‌క్యూ-17, ఎల్-17 మీడియం రేంజ్ రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేస్తోంది. చైనాకు చెందిన ఈ హెచ్‌క్యూ-9 వ్యవస్థ రష్యాకు చెందిన అత్యంత శక్తివంతమైన ఎస్-400 (S-400) క్షిపణి వ్యవస్థతో సమానమైనదని రక్షణ నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు మానవరహిత వైమానిక దాడుల కోసం టర్కీకి చెందిన 'కారాయెల్' మీడియం-ఆల్టిట్యూడ్ లాంగ్-ఎండ్యూరెన్స్ డ్రోన్లను, సరికొత్త లోయిటరింగ్ మ్యునిషన్లను (ఆత్మహుతి డ్రోన్లు) ఇస్లామాబాద్ దక్కించుకోవాలని చూస్తోంది.
బయటపడిన లోపాలు.. భారత వ్యూహం
దాదాపు 88 గంటల పాటు సాగిన 'ఆపరేషన్ సిందూర్'లో భారత సైన్యం ఉపయోగించిన బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్షిపణులు, స్వదేశీ సాంకేతికతతో రూపొందిన ఆకాశ్, ఆకాశ్‌తీర్ రక్షణ వ్యవస్థల ధాటికి పాకిస్థాన్ వద్ద ఉన్న చైనా క్షిపణులు, టర్కీ డ్రోన్లు (సోంగార్, వైఐహెచ్‌ఏ మోడల్స్) పూర్తిగా విఫలమయ్యాయి. పాక్ ప్రయోగించిన పీఎల్-15 ఎయిర్-టు-ఎయిర్ క్షిపణులను కూడా భారత్ తన మల్టీ-లేయర్డ్ డిఫెన్స్ సిస్టమ్‌తో గాల్లోనే తుత్తునియలు చేసింది. ఈ పరాభవాన్ని దృష్టిలో ఉంచుకుని, చైనా క్షిపణులను తూర్పు సరిహద్దుల్లో మోహరించి భారత వైమానిక దాడులను అడ్డుకోవాలని, అలాగే టర్కీ డ్రోన్లను నియంత్రణ రేఖ (LoC) వెంబడి నిఘా కోసం ఉపయోగించాలని పాక్ ప్రణాళికలు రచిస్తోంది.
మరోవైపు పాకిస్థాన్ చేస్తున్న ఈ అంతర్జాతీయ రక్షణ కొనుగోళ్లను భారత రక్షణ శాఖ నిశితంగా గమనిస్తోంది. పాక్ ఎత్తుగడలను తిప్పికొట్టేందుకు వీలుగా సరిహద్దుల్లో ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ (ఈడబ్ల్యూ) సామర్థ్యాలను భారత్ మరింత పటిష్టం చేస్తోంది. ఇందులో భాగంగా మరికొన్ని ఎస్-400 క్షిపణి వ్యవస్థలను రంగంలోకి దించడంతో పాటు, డీఆర్‌డీవో (DRDO) స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన అత్యాధునిక యాంటీ-డ్రోన్ రక్షణ కవచాలను సరిహద్దుల్లో మోహరించేందుకు భారత సైన్యం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.