రూపాయి కూడా తేలేదు: కిషన్ రెడ్డి, బండి సంజయ్ లపై కడియం శ్రీహరి ఫైర్

Kazipet Railway Division Long Overdue Kadiam Srihari Launches Sharp Attack
  • తెలంగాణ కేంద్ర మంత్రుల వల్ల రాష్ట్రానికి ఉపయోగం లేదన్న శ్రీహరి
  • కాజీపేట రైల్వే డివిజన్ ను తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్
  • రేవంత్ పై కేటీఆర్ వాడుతున్న భాష సరికాదని వ్యాఖ్య

కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లతో పాటు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన క్యాంప్ ఆఫీస్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన ఆయన.. కేంద్ర మంత్రులు ఇద్దరూ తెలంగాణ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా అదనంగా తీసుకురాలేదని, వారి వల్ల రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.


ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల దశాబ్దాల కల అయిన ‘కాజీపేట రైల్వే డివిజన్’ను తక్షణమే ఏర్పాటు చేయాలని శ్రీహరి కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు. ఈ డివిజన్ ఏర్పాటు ద్వారా ఈ ప్రాంతంలో పారిశ్రామిక వృద్ధి పెరగడమే కాకుండా, స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన స్పష్టం చేశారు. గత 12 ఏళ్లుగా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణను ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం చేస్తోందని.. అసలు ప్రధాని మోదీకి, బీజేపీకి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇష్టం లేదని ఆరోపించారు. కేంద్ర మంత్రులు కేవలం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని, బండి సంజయ్ చెబుతున్న రూ.13 లక్షల కోట్ల నిధుల్లో రాష్ట్రానికి వచ్చిన ప్రాజెక్టులు ఏవో శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు.


ఇదే సమావేశంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరును కూడా శ్రీహరి తప్పుపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వాడుతున్న భాష ఏమాత్రం సమర్థనీయం కాదన్నారు. "ప్రజల చేత ఎన్నికైన ఒక ముఖ్యమంత్రిని ‘తెలంగాణ ద్రోహి’ అని పిలవడం కేటీఆర్ అహంకారానికి నిదర్శనం. అధికారం కోల్పోవడంతోనే ఆయన ఇలా మాట్లాడుతున్నారు. ఆయనకు నాయకత్వ లక్షణాలు లేవనే విషయాన్ని స్వయంగా ఆయన సోదరే (కవిత) గతంలో చెప్పిన విషయాన్ని గుర్తుంచుకోవాలి" అని వ్యాఖ్యానించారు. కేటీఆర్ తన రాజకీయ శైలిని, భాషను మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
Go Back to Shorts
Kadiam Srihari
Kishan Reddy
Bandi Sanjay
BJP
KTR
BRS

More Telugu News