పవన్ కల్యాణ్ భాష, తీరు సరిగా లేదు: గుత్తా సుఖేందర్ రెడ్డి

  • తెలంగాణ ఆవిర్భావ వేడుకల వేళ పవన్ ఇక్కడ సభ పెడతాననడం సరికాదన్న గుత్తా
  • చంద్రబాబు, పవన్, మంత్రులు అమరావతిలో ఉండాని సూచన
  • తెలంగాణతో పోలిస్తే ఏపీకే ఎక్కువ వనరులు ఉన్నాయని వ్యాఖ్య

తెలంగాణ శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ కూటమి నాయకులకు, ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు గట్టి కౌంటర్‌ ఇచ్చారు. మీడియా ప్రతినిధులతో జరిగిన చిట్‌చాట్‌లో ఆయన ఏపీ నాయకుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరుగుతున్న ఈ కీలక సమయంలో.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇక్కడ సభలు నిర్వహిస్తామనడం ఎంతమాత్రం సరైనది కాదని గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడిన భాష, ఆయన తీరు అస్సలు బాలేదని వెల్లడించారు.


ఆంధ్రప్రదేశ్ రాజధానిపై కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "అమరావతి బ్రహ్మాండమైన రాజధాని అని చెబుతున్న ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, అక్కడి మంత్రులు ముందు అమరావతిలోనే నివాసం ఉండాలి" అని సూచించారు. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువ వనరులు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ఏపీకి సుదీర్ఘమైన సముద్ర తీరంతో పాటు, రకరకాల పోర్టులు కూడా ఉన్నాయని... కాబట్టి ఆ నాయకులంతా వారి రాష్ట్ర అభివృద్ధిని చూసుకోవాలి తప్ప, తెలంగాణ వైపు చూడాల్సిన అవసరం లేదని హితవు పలికారు. ఇక్కడ ఎలాంటి విద్వేషాలు సృష్టించడానికి ప్రయత్నించవద్దని హెచ్చరించారు.


తెలంగాణ వ్యవసాయ రంగం, ధాన్యం కొనుగోళ్లపై గుత్తా సుఖేందర్ రెడ్డి పలు వివరాలను పంచుకున్నారు. తెలంగాణలో ఇప్పటికే 75 శాతం ధాన్యం సేకరణ పూర్తయిందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లకు కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం సహకరించడం లేదని ఆరోపించారు. రైతులు సాంప్రదాయ పద్ధతుల్లోనే కాకుండా పంట మార్పిడి వైపు దృష్టి సారించాలని కోరారు. ప్రస్తుతం మన రైతులు వరి, పత్తి తప్ప వేరే ఇతర పంటలు పండించడం లేదని, దీనిపై మార్పు రావాలని ఆయన వివరించారు.


Gutha Sukhender Reddy
Congress
Pawan Kalyan
Janasena
Chandrababu
TDP

More Telugu News