ఆఫీస్ అయిపోయాక బైక్ టాక్సీ.. పీహెచ్‌డీ స్కాలర్ వినూత్న గాథ!

  • ఉద్యోగం చేస్తూ రాపిడో నడుపుతున్న దీపక్
  • బైక్ టాక్సీ ద్వారా అదనపు ఆదాయం
  • రాత్రి వేళల్లో పీహెచ్‌డీ పరిశోధనల నిర్వహణ
  • సోషల్ మీడియాలో వైరలైన యువకుడి వీడియో
  • భయాన్ని వీడితేనే విజయం సాధ్యమని సూచన
కార్పొరేట్ ఉద్యోగం, చేతినిండా జీతం.. అంతా బాగున్నా ఏదో వెలితి. ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సాగే ఆ రొటీన్ జీవితం అతనికి బోర్ కొట్టింది. ఆ విసుగు నుంచి పుట్టిన ఆలోచనే ఓ యువకుణ్ని సరికొత్త మార్గంలో నడిపించింది. ఆఫీస్ పని ముగిసిన తర్వాత బైక్ టాక్సీ నడుపుతూ, మరోవైపు ఉన్నత చదువులు కొనసాగిస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ పీహెచ్‌డీ స్కాలర్ అద్భుతమైన కథ ఇది.

ఉద్యోగంలో అలసట, యాంత్రిక జీవనంపై విరక్తి చెందిన దీపక్ పాండే భిన్నంగా ఆలోచించారు. ఆఫీస్ వేళల తర్వాత రాపిడో బైక్ టాక్సీ రైడర్‌గా మారారు. మొదట్లో కేవలం మనశ్శాంతి కోసం సరదాగా ప్రారంభించిన ఈ పని ఇప్పుడు అతని దినచర్యలో భాగమైపోయింది. ప్రస్తుతం ఆయన పార్ట్ టైమ్ రైడింగ్ ద్వారా రోజుకు రూ.600 నుంచి రూ.700 వరకు సంపాదిస్తున్నారు. అదే పూర్తి సమయం కేటాయిస్తే ఏకంగా రూ.1500 వరకు ఆర్జిస్తున్నారు.

దీపక్ పాండే జీవితం ఇప్పుడు చాలా బిజీగా మారిపోయింది. పగలు కార్పొరేట్ ఉద్యోగం చేయడం, సాయంత్రం ప్రయాణికులను బైక్‌పై గమ్యస్థానాలకు చేర్చడం అతని పని. ఆ తర్వాత రూమ్‌కు వచ్చి సొంతంగా వంట చేసుకోవడం, అర్ధరాత్రి తన పీహెచ్‌డీ పరిశోధనలు చేసుకోవడం అతని దినచర్య. దీనితో పాటు తన ప్రయాణాన్ని వీడియోలుగా తీసి ఎడిట్ చేస్తూ ‘@trippypandey03’ అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేటర్‌గానూ రాణిస్తున్నారు.

ఒకప్పుడు రోజూ ఆఫీస్ ముగిసేసరికి తీవ్రమైన అలసటతో, ఎలాంటి ఉత్సాహం లేకుండా బతికేవాణ్నని దీపక్ చెప్పారు. ఓటమి, ఎవరు ఏమనుకుంటారో అనే భయాల వల్లే ఇన్నాళ్లూ కొత్త విషయాలు ప్రయత్నించలేకపోయానని అన్నారు. కానీ భయాన్ని వీడి అడుగు ముందుకు వేశాక తన సామర్థ్యం ఏంటో తనకే తెలిసిందన్నారు. రాత్రి 11 గంటలైనా తన కాళ్లు అలసిపోవని, కలలు పెద్దవైనప్పుడు యాక్సిలరేటర్‌ను మరింత గట్టిగా నొక్కాలంటూ ఆయన యువతకు పిలుపునిచ్చారు.

దీపక్ పోస్ట్ చేసిన ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. ఆయనను చూసి స్ఫూర్తి పొంది తాము కూడా పార్ట్ టైమ్ పనులు చేస్తున్నామంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు. అయితే కొందరు మాత్రం ఈ జీవన శైలిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత కష్టపడటం వల్ల శారీరక, మానసిక ఒత్తిడి పెరిగి అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా కేవలం ఒకే ఉద్యోగానికి పరిమితం కాకుండా తమ జీవితాన్ని మార్చుకోవాలనుకునే నేటి తరానికి దీపక్ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

Deepak Pandey
Rapido
PhD scholar
bike taxi
Corporate job
Trippypandey03
Instagram

More Telugu News