తెలంగాణలో పెరగనున్న భూముల విలువలు.. జూన్ 5 నుంచి కొత్త రేట్లు!
- భూములు, ప్లాట్లు, అపార్ట్మెంట్ల మార్కెట్ విలువ సవరణ
- పెరగనున్న స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు
- శాస్త్రీయ పద్ధతిలో విలువలు సవరించినట్టు తెలిపిన మంత్రి పొంగులేటి
- వాస్తవ ధరలకు అనుగుణంగా మార్పులు చేసినట్టు వెల్లడి
ఈ సవరణ కోసం ప్రభుత్వం శాస్త్రీయమైన, పారదర్శకమైన విధానాన్ని అనుసరించినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో క్షేత్రస్థాయి అధ్యయనాలు, రిజిస్ట్రేషన్ల డేటా విశ్లేషణ, నిపుణుల కమిటీల సూచనలను పరిగణనలోకి తీసుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రోడ్ వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పారిశ్రామిక వృద్ధి, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని డిమాండ్‌ను ఆధారంగా చేసుకుని కొత్త విలువలను నిర్ధారించారు.
కొత్త విధానం ప్రకారం, కొన్ని ప్రాంతాల్లో అపార్ట్మెంట్లలోని అన్ని అంతస్తులకు ఒకే రకమైన విలువను వర్తింపజేయనున్నారు. ఇప్పటికే అధిక విలువలు ఉన్నచోట్ల ఎలాంటి పెంపు ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ సహా కీలక ప్రాంతాల్లో వ్యవసాయ భూములు, నివాస ప్లాట్లు, ఫ్లాట్లకు కొత్త కనీస ధరలను నిర్ణయించారు.
ఈ సవరణ ఫలితంగా స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి. ఇది ఆస్తి కొనుగోలుదారులపై, పెట్టుబడిదారులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే, ప్రజలపై అనవసర భారం పడకుండా హేతుబద్ధంగానే ఈ మార్పులు చేశామని, దీనివల్ల ప్రభుత్వ ఆదాయం పెరగడంతో పాటు లావాదేవీలలో పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.