ప్రాంతీయవాదం ఉగ్రవాదం అయితే... మీరే ఉగ్రవాదులు: పవన్ కల్యాణ్ పై నిరంజన్ రెడ్డి ఫైర్
- ఆంధ్రరాష్ట్ర పునాదులపై ఏర్పడిందే అసలైన ప్రాంతీయవాదం అన్న నిరంజన్ రెడ్డి
- తెలంగాణ ప్రజలు జాతీయవాదులు అని వ్యాఖ్య
- పక్క రాష్ట్ర నేతలు తెలంగాణను వెక్కిరిస్తుంటే రేవంత్ ఎందుకు మనంగా ఉన్నారని ప్రశ్న
ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. "ఆంధ్రరాష్ట్ర పునాదులపై ఏర్పడిందే అసలైన ప్రాంతీయవాదం. ప్రాంతీయవాదం ఉగ్రవాదం అయితే, మొదట మీరే ఉగ్రవాదులు అవుతారు" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
నాటి రాచరికపు పాలన అంతమై, తెలంగాణ భారతదేశంలో విలీనం కావాలని ప్రాణాలర్పించి పోరాటం చేసిన జాతీయవాదులు తమ తెలంగాణ ప్రజలని నిరంజన్ రెడ్డి అన్నారు. నాటి కాలంలో తమను బలవంతంగా ఆంధ్ర ప్రాంతంతో విలీనం చేశారని.. ఆ తర్వాత జరిగిన అన్యాయాలు, దుర్మార్గాల నుంచి విడిపోవాలనే ఇక్కడి ప్రజలు పోరాడారు తప్ప, తెలంగాణ ప్రజలు ప్రాంతీయవాదులు కారని ఆయన తేల్చి చెప్పారు.
రాష్ట్రంలో అధికార పక్షం, ప్రతిపక్షాల మధ్య ఎన్ని రాజకీయ విభేదాలైనా ఉండొచ్చని.. కానీ, పొరుగు రాష్ట్రాల నేతలు వచ్చి తెలంగాణను అవమానిస్తుంటే అందరూ ఏకతాటిపైకి వచ్చి ఖండించకపోవడం దారుణమన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ ఎల్లప్పుడూ తెలంగాణ ప్రజల పక్షానే నిలబడుతుందని స్పష్టం చేసిన ఆయన.. ప్రభుత్వ వైఫల్యాలను, తెలంగాణకు జరుగుతున్న అవమానాలను సోషల్ మీడియా వేదికగా గట్టిగా ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు, ప్రజలకు పిలుపునిచ్చారు.