ఫిఫా వరల్డ్‌ కప్‌లో ఆడనున్న భారతీయులు వీళ్లే..!

  • ఫిఫాలో ఆడనున్న ముగ్గురు భారత సంతతి ఆటగాళ్లు
  • ఖతార్ జట్టులో కేరళ కుర్రాడు జంషీద్
  • న్యూజిలాండ్ తరపున ఆడనున్న సర్ప్రీత్ సింగ్
  • ఆస్ట్రేలియా జట్టులో నిషాన్ వేలుపిళ్లైకి చోటు
  • నియాల్ మేసన్‌కు ఖతార్‌ తుది జట్టులో చేజారిన చోటు
ఫుట్‌బాల్ ప్రపంచకప్ జూన్‌ 11న ప్రారంభం కానుంది. అమెరికా, కెనడా, మెక్సికో దేశాలు సంయుక్తంగా ఈ మెగా టోర్నీని నిర్వహిస్తున్నాయి. భారత్ ఈ టోర్నీకి అర్హత సాధించలేదు. అయినప్పటికీ భారతీయ ఫుట్‌బాల్ అభిమానులు గర్వపడేలా ఓ అద్భుతం జరగబోతోంది. ఈసారి వరల్డ్ కప్‌లో వేర్వేరు దేశాల తరఫున ముగ్గురు భారత సంతతి ఆటగాళ్లు బరిలోకి దిగుతున్నారు.

ఖతార్ జట్టులో కేరళ కుర్రాడు
ఖతార్ జాతీయ జట్టుకు ఎంపికైన 19 ఏళ్ల తహ్సిన్ మహ్మద్ జంషీద్ తల్లిదండ్రులు కేరళలోని కన్నూర్ నుంచి అక్కడికి వలస వెళ్లారు. ఖతార్‌లోని ప్రముఖ ఆస్పైర్ అకాడమీలో శిక్షణ పొందిన ఈ యువ ఆటగాడు ఆ దేశ టాప్ లీగ్‌లో ఆడిన మొదటి భారత సంతతి ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. ఇప్పుడు ఏకంగా ఖతార్ సీనియర్ జట్టులో చోటు సంపాదించి వరల్డ్ కప్‌నకు సిద్ధమయ్యాడు.

న్యూజిలాండ్ జట్టులో పంజాబీ స్టార్
న్యూజిలాండ్ జట్టు తరపున ఆడుతున్న 27 ఏళ్ల మిడ్‌ఫీల్డర్ సర్ప్రీత్ సింగ్ తల్లిదండ్రులు పంజాబ్‌లోని జలంధర్‌ ప్రాంతానికి చెందినవారు. గతంలో జర్మనీకి చెందిన ప్రసిద్ధ క్లబ్ ‘బేయర్న్ మ్యూనిచ్’ తరఫున ఆడాడు. జర్మన్ లీగ్‌లో ఆడిన మొదటి భారత సంతతి ఆటగాడిగా సర్ప్రీత్ చరిత్ర సృష్టించాడు. ఈ వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్ జట్టుకు ఇతడే ప్రధాన బలం కానున్నాడు.

ఆస్ట్రేలియా జట్టులో నిషాన్ వేలుపిళ్లై
ఆస్ట్రేలియా జట్టులో చోటు దక్కించుకున్న 25 ఏళ్ల నిషాన్ వేలుపిళ్లై మెల్‌బోర్న్‌లో జన్మించాడు. ఇతడి తల్లి ఆంగ్లో-ఇండియన్ కాగా, తండ్రి శ్రీలంక తమిళ సంతతికి చెందిన మలేషియన్. ఆస్ట్రేలియా దేశవాళీ లీగ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన నిషాన్, చైనాతో జరిగిన క్వాలిఫైయర్ మ్యాచ్‌లో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చి విన్నింగ్ గోల్ కొట్టి ఆస్ట్రేలియాను వరల్డ్ కప్‌నకు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు.

చివరి నిమిషంలో చేజారిన అవకాశం
ఈ ముగ్గురు ఆటగాళ్లు వరల్డ్ కప్ ఆడుతుండగా మరో భారత సంతతి డిఫెండర్ నియాల్ మేసన్‌కు మాత్రం చివరి నిమిషంలో నిరాశ ఎదురైంది. భారతీయ తల్లి, అమెరికా తండ్రికి జన్మించిన ఈ 29 ఏళ్ల ఆటగాడు ఖతార్ ప్రాథమిక జట్టులోని 34 మందిలో చోటు దక్కించుకున్నాడు. కానీ ప్రకటించిన 26 మందితో కూడిన తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.

FIFA World Cup
Foot Ball
Indians in Foot Ball

More Telugu News